
భక్తులకు మజ్జిగ వితరణ
రాయగడ: స్థానిక మణిద్వీప మహిళా సంఘం ఆధ్వర్యంలో మజ్జిగౌరీ మందిరం ప్రాంగణంలో ఆదివారం మజ్జిగ వితరణ కార్యక్రమం జరిగింది. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మజ్జిగౌరీ అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ వితరణ కార్యక్రమం చేపట్టినట్లు క్లబ్ అధ్యక్షురాలు మరాటం సుజన తెలిపారు. ఆదివారం అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో క్లబ్ ద్వారా సేవా కార్యక్రమం చేపట్టామన్నారు. ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలను తమ క్లబ్ తరచూ నిర్వహిస్తుందని అన్నారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి వి.స్వాతి, కోశాధికారి కె.లావణ్య, సహాయ కార్యదర్శి కె.సుహాసిని, సభ్యులు కింతలి జ్యోతిర్మణి, క్రిష్ణవేణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పాము కాటుతో వ్యక్తి మృతి
మల్కన్‌గిరి: పాముకాటుతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా పోడియా సమితి మాటేర్ పంచాయతీ కుమారగూడ గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకోగా బీమా మాడీ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కేందు ఆకులు (బీడీ ఆకులు) తీయడం కోసం బీమా మాడీ సమీప అడవికి వెళ్లాడు. కింద పడిపోయిన ఆకులు తీస్తుండగా అందులో ఉన్న విష సర్పం కాటు వేసింది. భయంతో కేకలు వేయగా సమీపంలో ఉన్న వారు అక్కడకు చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి.. బాధితుడిని పోడియా ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు..అప్పటికే బీమా మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతిని భార్య ఫిర్యాదు మేరకు పోడియా పోలీసుస్టేషన్ అధికారి నిరోధ్ కుమార్ బాష్ ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డ్యామ్‌లో పడి యువకుడు..
కొరాపుట్: కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి పాడువా పోలీస్ స్టేషన్ పరిధిలో చంపాపుట్ గ్రామానికి చెందిన బలరాం దురువా (40) ఆదివారం మాచ్‌ఖండ్ నది పరిధిలోని జాలా పుట్ డ్యామ్‌లో పడి మృతి చెందాడు. నందపూర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది మృతదేహాన్ని డ్యామ్ నుంచి వెలుపలికి తీశారు. పాడువా పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
గూడ్స్ రైలులో మంటలు
రాయగడ: రాయిపూర్ నుంచి విశాఖపట్నం పోర్టుకు బొగ్గులోడుతో వెళుతున్న గూడ్స్‌రైలులో మంటలు చెలరేగాయి. శనివారం సాయంత్రం ఈ ఘటన జిల్లాలోని బిసంకటక్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. రాయిపూర్ నుంచి బొగ్గు లోడుతో వస్తున్న గూడ్స్ బిసంకటక్ రైల్వే స్టేషన్‌లో కొద్దిసేపు నిలిచింది. కొంతసేపటికి ఒక బోగీ నుంచి పొగలు రావడం గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే స్టేషన్ మాస్టార్‌కు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన ఆయన వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
పిడుగుపాటుకు పశువులు మృతి
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌లో పిడుగుపాటుకు మూడు పశువులు మృతి చెందాయి. శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతొ కూడిన వర్షం కురిసింది. ఇంటిముందు ఉన్న చెట్టు కింద పశువులు పచ్చిక మేస్తున్న సమయంలో చెట్టుపై పిడుగు పడింది. దీంతో కింద ఉన్న తమ పశువులు మృతి చెందాయని బాధితులు ఘాసి భొత్ర, సుందర్ కౌసల్యలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.

భక్తులకు మజ్జిగ వితరణ

భక్తులకు మజ్జిగ వితరణ

భక్తులకు మజ్జిగ వితరణ