
విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి
జిల్లా విద్యుత్ పర్యవేక్షక ఇంజినీర్
డాక్టర్ ప్రత్తిపాటి విజయ్‌కుమార్
రొంపిచర్ల: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించాలని జిల్లా విద్యుత్ పర్యవేక్షక ఇంజినీర్ డాక్టర్ ప్రత్తిపాటి విజయ్‌కుమార్ అన్నారు. రొంపిచర్ల సెక్షన్ పరిధిలోగల వి.రెడ్డిపాలెం 33/11 విద్యుత్ సబ్‌స్టేషన్‌ను శనివారం జిల్లా విద్యుత్ పర్యవేక్షక ఇంజినీర్ డాక్టర్ ప్రత్తిపాటి విజయ్‌కుమార్ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ నూరు శాతం విద్యుత్ రెవెన్యూ వసూలు చేయాలన్నారు. ప్రతి నెలా రెండో శనివారం లైన్ మెయింటెనెనన్స్ చేయాలన్నారు. నూతన సర్వీసులను వెంటనే మంజూరు చేయాలన్నారు. 50శాతం రాయితీతో అదనపు లోడ్ క్రమబద్ధీకరించుకొనుటకు జూన్ 30 వరకు అవకాశం ఉందన్నారు. దీనిపై వినియోగదారులకు అవగాహన కలిగించాలన్నారు. అదనపు లోడ్‌ను వినియోగదారులు రెగ్యులరైజ్ చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో నరసరావుపేట రూరల్ డీఈఈ బి.వెంకటేశ్వరరెడ్డి, మండల ఏఈఈ కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
అలరించిన కళాంజలి నాటకోత్సవాలు
చీరాల అర్బన్: చీరాల కళాంజలి ఆధ్వర్యంలో ఐదురోజులు పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ నాటకోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. స్థానిక కస్తూరిభా గాంధీ మున్సిపల్ గరల్స్ హైస్కూల్ ఆవరణలో ప్రదర్శనలు నిర్వహించారు. శనివారం రాత్రి డాక్టర్ రాయని హనుమంతరావు కళావేదికపై విజయవాడకు చెందిన త్రిధారా ది ఆర్ట్స్ ల్యాండ్స్ వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన, శ్రీరామ పట్టాభిషేకం నృత్య రూపకం ప్రదర్శించారు. చిన్నారులచే ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరిని అలరించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత వడలి రాధాకృష్ణకు సత్కారం నిర్వహించారు. అలానే సహృదయ, ద్రోణాదుల వారిచే వర్క్ ఫ్రం హోమ్ హాస్యనాటికను ప్రదర్శించారు. నాటికకు రచన అద్దేపల్లి భరత్‌కుమార్, దర్శకత్వం డి.మహేంద్ర వ్యవహించారు. కార్యక్రమానికి ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఐదు రోజులు పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు సంస్థలు వారిచే నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు కళాంజలి అధ్యక్ష, కార్యదర్శులు కోడూరి ఏకాంబరేశ్వరబాబు, సాంబశివరావులు తెలిపారు.

విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి