
అనుమానాస్పదస్థితిలో వృద్ధురాలి మృతి
వెల్దుర్తి: ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని ఓ వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మండలంలోని కొత్తపుల్లారెడ్డిగూడెం సమీపంలో ఆదివారం జరిగింది. మాచర్ల పట్టణానికి చెందిన తెడ్లా లక్ష్మి (65) శనివారం సాయంత్రం 5గంటల సమయంలో భర్త శంకరరావు గుడికి వెళ్లిన సమయంలో ఒంటిపై ఉన్న బంగారపు నానుతాడు, ఉంగరం ఇంట్లో టేబుల్‌పై పెట్టి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. భర్త ఇంటికి వచ్చి చూడగా తాళం వేసి ఉంది. బాత్‌రూంలో తాళం చెవి ఉండటంతో తలుపు తెరిచి లోపలకు వెళ్లాడు. టేబుల్‌పై బంగారపు వస్తువులు ఉండటంతో శంకరరావు ఇరుగు పొరుగు వారిని వాకబు చేశాడు. లక్ష్మి కనిపించకపోవడంతో మాచర్ల టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆదివారం ఉదయం కొత్తపుల్లారెడ్డిగూడెం శివారులో బహిర్భూమికి వెళ్లిన వారు ఆంజనేయస్వామి దేవాలయం పక్కన కాలిపోయిన స్థితిలో మృతదేహం ఉందని గ్రామస్థులకు తెలపగా వారు వెల్దుర్తి పోలీసులకు సమాచారమందించారు. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు వెల్దుర్తి ఎస్‌ఐ సమందర్ వలి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.