
సబ్సిడీ రుణాలకు ఇంటర్వ్యూలు
కోల్‌సిటీ(రామగుండం): రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్నవారికి బుధవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ప్రారంభించారు. ఈనెల 21వ తేదీ వరకు మొత్తం 11,446 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 8,195 మంది బల్దియా కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించారు. యూనిట్ల వారీగా అర్హులను గుర్తించడం కోసం ఈనెల 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు కమిషనర్(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ తెలిపారు. తొలిరోజు ఎన్టీపీసీ, రామగుండం ఏరియాలకు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ పరిధిలోని దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ రెండు బ్యాంకులకు 1,050 మంది దరఖాస్తు చేసుకోగా, ఇదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఇద్దరే అధికారులు ఇంటర్వ్యూలను నిర్వహించడంతో ప్రక్రియ ఆలస్యంగా జరిగింది. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి పర్యవేశించారు. అభ్యర్థులు ఒరిజినల్ ఆధార్, పాన్‌కార్డు, రేషన్ కార్డు/ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ పత్రాలను వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు.