
అమరావతిలో ఎప్పట్లానే ఉగాది ఆస్థానం ఏర్పాటు చేసారు... గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే చంద్రబాబు.. లోకేష్.. మంత్రులు మాత్రమే ఉండేవాళ్ళు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం ఆస్థానంలో పాల్గొన్నారు. పంచాంగకర్త మాడుగుల నాగఫణి శర్మ.. గతంలో మాంచి ఫామ్‌లో ఉంటూ.. కొన్ని అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుని ఫేడ్ అవుట్ అయిన మాడుగుల నాగఫణి శర్మ పంచాంగం చదూతున్నారు. లోలోన పవన్ లోకేష్ ఇద్దరూ టెన్షన్ టెన్షన్ అవుతున్నారు.. మాకు ఎలా ఉంటుంది.. ఏమై ఉంటుంది.. భవిష్యత్ బంగారమే కదా అంటూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. నాగబాబు కూడా కొత్త కండువా మాటికీ సర్దుకుంటూ మేధావి నవ్వు నవ్వుతూ అటూ ఇటూ చూస్తున్నాడు. అసలు ఉగాది పండగను కనిపెట్టి.. తెలుగుప్రజలు కొత్త సంవత్సరాన్ని పరిచయం చేసిన చంద్రబాబు కూడా చిద్విలాసంతో కూర్చున్నారు..
చెప్పండి శర్మగారూ అని చంద్రబాబు ఆదేశించగా... ముందుగా ఆదాయ వ్యయాలు అని మొదలెట్టారు.. ఆ.. గమ్మున చెప్పండి అన్నారు అందరూ కోరస్ గా.. మీ అందరికీ ఆదాయం వెయ్యి.. ఖర్చు పావలా అన్నారు శర్మగారు.. దీంతో వారంతా లోలోన మురిసిపోయారు.. అవును .. అమరావతి కాంట్రాక్టులతో బాగానే వస్తోంది.. ఎక్కడా పైసా ఖర్చు చేయక్కర్లేదు.. శర్మగారు బాగానే చెప్పారు అనుకున్నారు.. లోకేష్ కూడా.. అవును పోస్టింగులు.. బదిలీలు అన్నీ నావే కాబట్టి నా ఆదాయం బాగానే ఉంటుంది.. పైగా జిల్లాలకు వెళ్ళినపుడు ఏమైనా ఖర్చు ఉన్నా అదంతా ప్రభుత్వ ఖాతాలోకి పోతుంది.. కాబట్టి నాకు అంతా ఆదాయమే అనుకున్నారు.
పవన్ కూడా నేను నియోజ కవర్గానికి వెళ్లడమే తక్కువ.. క్యాడర్ గురించి బాధ లేదు.. అటు సినిమాలు చేస్తూ ఆదాయం బాగానే వస్తోంది.. అంటే పంచాంగం కరెక్ట్ గానే ఉన్నట్లుంది అనుకున్నారు. ఇక రాష్ట్ర ఆదాయం గురించి శర్మ గారు చెబుతూ రాష్ట్రానికి ఆదాయం తగ్గుతుంది.. అప్పులు పెరుగుతాయి అన్నారు.. ఇది విన్నాక బాబుగారు లోలోన రాష్ట్రం ఏమైపోతే నాకేంటి..స్టేట్ మొత్తం అప్పులైతే నాకేంది అనుకున్నారు. ఇహ లోకేష్ గారి సంగతి చూస్తే అంటూ కండువా సవరించుకున్న శర్మగారు.. ఆయనకు సీఎం పదవికి ప్రస్తుతం పవనాలు అనుకూలంగా లేవు.. కొన్నాళ్ళు మంత్రిగిరిలోనే ఉంటారు అన్నారు..
దీంతో లోకేష్ పవన్ వైపు గుర్రుగా చూడగా.. నిన్ను సీఎం ను ఎలా చేస్తాను అనుకున్నావు అంటూ పవన్ బదులిచ్చారు. ఇప్పుడు పవన్ గారి రాశి ప్రకారం చూస్తే ప్రస్తుతానికి ఫర్లేకున్నా మున్ముందు భవిష్యత్ కష్టమే అన్నారు.. దీంతో లోకేష్ చంద్రబాబులు పవన్ను కుమ్మేద్దాం కళ్ళతో అని సిగ్నల్స్ ఇచ్చుకున్నారు. మరి నా సంగతి ఏమిటి అన్నాడు నాగబాబు.. నీకూ పదవీ యోగం ఉంది అన్నాడు శర్మ.. హమ్మయ్య అనుకుంటూ అందరూ వెళ్లిపోయారు..
:::సిమ్మాదిరప్పన్న...