
అమరావతి, సాక్షి: రుషికొండ భవనాలపై ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రచ్చ రేగింది. నిర్మాణాలపై అడ్డగోలు ప్రచారాలు చేసిన కూటమి ప్రభుత్వం.. ఆపై కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించింది. ఈ పరిణామంపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూటమిని నిలదీశారు.
రుషికొండ భవనాలు వాడుకోకపోవటం ప్రభుత్వం చేతకానితనం. రుషికొండ భవన నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. నిజంగా అవకతవకలు జరిగి ఉంటే రూ. 80 కోట్ల రూపాయల బిల్లులు ఎందుకు చెల్లించారు?. తప్పు జరిగిందని చెప్పినప్పుడు చెల్లింపులు చేయడం ఎందుకు? అని బొత్స ప్రశ్నించారు.
రుషికొండ భవన నిర్మాణాల్లో అవకతవకలు జరిగుంటే విచారణకు చేయించండి. తప్పు జరిగినపుడు ఎందుకు విచారణకు జంకుతున్నారు. మేం సభలో ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. మేము ఏదైతే మాట్లాడతామో దానికే కట్టుబడి ఉంటాం అని అన్నారాయన.
అయితే.. బొత్స ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించింది రుషికొండ నిర్మాణాలకు కాదని, వేరే పనులకు అని చెప్పారు. ఈ క్రమంలో గత ఐదేళ్లలో టీడీపీ నేతలు చేసిన పనులకు ఒక్క బిల్లు కూడా చెల్లించలేదని ఆరోపించారాయన.
