
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సహచర పక్షాలను మోసగించే ‘పొత్తులమారి నక్క’ తెలుగుదేశం పార్టీ ఎప్పటిలానే ఈసారి జనసేనకు ఝలక్ ఇచ్చేందుకు వ్యూహం పన్నుతోంది. ఉత్తరాంధ్రలో ఉన్న 35 సీట్లలో కేవలం విశాఖ దక్షిణ, భీమిలి నియోజకవర్గాలతోపాటు పెందుర్తి/యలమంచిలిలో ఏదో ఒక స్థానాన్ని కలిపి మొత్తం మూడు మాత్రమే జనసేనకు కేటాయించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అంతర్గతంగా టీడీపీ అధినాయకత్వం ఆ పార్టీ నేతలకు చెబుతుండటం గమనార్హం. సర్వేల సాకుతో పొత్తు ధర్మానికి తూట్లు పొడిచేందుకు కుట్ర పన్నుతున్నట్టు సమాచారం.
టీడీపీ ఎత్తులను పసిగట్టిన జనసేన తన బలం పెంచుకునేందుకు కొత్త నేతలకు ఆహ్వానం పలుకుతోంది. పెద్దగా ప్రజాబలం లేకున్నా.. గతంలో ఎన్నడో రాజకీయాలు చేసిన వారిని పార్టీలో చేర్చుకుంటోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే పడాల అరుణను చేర్చుకుంది. తాజాగా అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణను ఆహా్వనిస్తోంది. తమ వద్ద బలమైన నేతలు ఉన్నారని చూపించుకునేందుకు తహతహలాడుతోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ‘సీట్ల ముడి’ అంత సులువుగా వీడేలా కనిపించడం లేదు.
నాలుగు జిల్లాల్లో జనసేనకు ‘సున్న’ం!
ఉత్తరాంధ్ర జిల్లాల పునర్విభజన తర్వాత శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలుగా రూపాంతరం చెందింది. ఈ ఆరు జిల్లాల్లో 35 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో విశాఖ జిల్లాలో రెండు సీట్లు, అనకాపల్లి జిల్లాలో ఒక్క సీటు మాత్రమే జనసేనకు ఇవ్వాలని టీడీపీ యోచిస్తోంది. అంటే నాలుగు జిల్లాల్లో జనసేనకు మొండిచేయి చూపనుందన్నమాట. దీంతో జనసేన నేతలు రగిలిపోతున్నారు.
వీరందరికీ మొండిచేయేనా..!
♦ శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల నుంచి విశ్వక్‌సేన్, పాతపట్నం నుంచి గేదెల చైతన్య జనసేన తరఫున సీట్లను ఆశిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో కాపు ఓటు బ్యాంకు అధికంగా ఉంది.
♦ విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, గజపతినగరం నుంచి పడాల అరుణ జనసేన తరఫున పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆమె జనసేన పొలిటికల్ కమిటీ మెంబర్‌గా కూడా ఉన్నారు.
♦ పార్వతీపురం జిల్లాలో సాలూరు సీటును తమకు కేటాయించాలని జనసేన నేతలు కోరుతున్నారు.
♦అయితే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల నుంచి ఒక్క సీటు కూడా జనసేనకు కేటాయించే అవకాశం లేదని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.
♦ విశాఖ జిల్లాలో భీమిలి, విశాఖ దక్షిణంలో ఏదో ఒక సీటును జనసేన తరఫున వంశీకృష్ణ యాదవ్ ఆశిస్తుండగా.. పెందుర్తి సీటు తనదే అన్న రీతిలో పంచకర్ల రమేష్ బాబు మొన్నటివరకు కార్యక్రమాలు చేశారు. గట్టి హామీ లేకపోవడంతో ఆయన సందిగ్ధంలో పడిపోయారు.
♦ యలమంచిలి నుంచి జనసేన తరఫున సుందరపు విజయ్‌కుమార్ పోటీకి యత్నింస్తున్నారు. అనకాపల్లి నుంచి పరుచూరి భాస్కర్‌రావు రేసులో ఉన్నారు. విశాఖ దక్షిణం నుంచి కందుల నాగరాజు, సాదీక్‌లు, విశాఖ ఉత్తరం నుంచి ఉషాకిరణ్, భీమిలిలో పంచకర్ల సందీప్ జనసేన తరఫున సీటు కోసం యత్నాలు చేస్తున్నారు. వీరిలో ఇప్పటివరకు తమకు కచ్చితంగా సీటు వస్తుందని బలంగా నమ్ముతున్న నేతలు ఒక్కరూ లేకపోవడం గమనార్హం.
♦ కొత్తగా చేరుతున్న కొణతాల రామకృష్ణ తనకు అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తారని చెబుతున్నా.. ఇప్పటికే టీడీపీ నుంచి ఆర్థికంగా బలంగా ఉన్న ఒకరికి హామీ ఇచ్చారని తెలుస్తోంది.