
వేపచెట్టుకు వినతులు కట్టి..!
● తలకిందులుగా వేలాడిన యువరైతు ● తన భూ సమస్యను పరిష్కరించాలని అభ్యర్థన
ఇబ్రహీంపట్నం: రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి నా భూ సమస్య పట్టించుకోకపోవడంతో ఓ యువ రైతు వినూత్నంగా నిరసన చేపట్టారు. మండలంలోని మంగళ్‌పల్లి గ్రామానికి చెందిన పి.జీవన్ తన తల్లి జయసుధ పేరుపై సర్వేనంబర్ 374లో ఎకరం 32 గుంటల భూమిని 2006లో కొనుగోలు చేశారు. ధరణి పోర్టల్ వచ్చిన అనంతరం నిషేధిత జాబితా లో ఆ భూమిని చేర్చారు. దీన్ని సవరించాలని తహ సీల్దార్,ఆర్డీఓ, కలెక్టర్,ముఖ్యమంత్రి కార్యాలయాల చుట్టూ తిరిగి వినతులు సమర్పించినా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలోనే గతేడాది ఆగస్టులో తహసీల్దార్ కార్యాలయంలో శీర్షాసనం వేసి నిరసన వ్యక్తం చేశాడు. అప్పట్లో ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారు. అయితే నెలలు గడిచినా చలనం లేకపోవడంతో మళ్లీ ఆందోళన బాట పట్టారు. తన పొలంలోని వేప చెట్టుకు వినతిపత్రాలు కట్టి.. కొమ్మకు తన కాళ్లను చుట్టి తలకిందులుగా వేలాడుతూ నిరసన తెలిపారు. ఈ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. తనది పేద కుటుంబమని, అధికారులు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు.
ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది
ప్రసుత్తం ఈ సమస్య ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది.374 సర్వే నంబర్‌లో 10.03 ఎకరాల భూమి ఉండగా అందులో ఎకరా 22 గుంటలను సీలింగ్ కింద డిక్లేర్ చేశారు. ధరణి పోర్టల్ వచ్చిన అనంతరం ఈ సర్వేనంబర్‌లోని భూమిని నిషేధిత జాబితాలో చే ర్చారు.ఈ అంశం ఉన్నతాధికారుల వద్దకు చేరింది.
– సునీత, తహసీల్దార్, ఇబ్రహీంపట్నం