అక్రమాలకు పట్టా! | - | Sakshi
Sakshi News home page

అక్రమాలకు పట్టా!

Published Tue, Apr 29 2025 9:43 AM | Last Updated on Tue, Apr 29 2025 10:07 AM

అక్రమ

అక్రమాలకు పట్టా!

అన్యాక్రాంతమవుతున్న భూదాన్‌ భూములు
● 21,931 ఎకరాలకు.. మిగిలింది ఏడు వేల ఎకరాలే ● మహేశ్వరం, యాచారం, హయత్‌నగర్‌, శేరిలింగంపల్లిలో ఆక్రమణలు ● మెజారిటీ భూములకుపట్టాలు సృష్టించిన వైనం ● కోర్టు కేసులతో ఒక్కొక్కటిగా వెలుగులోకి

జిల్లాలోని భూదాన్‌ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. కళ్లముందే ఇవి కరిగిపోతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీనికి తోడు రికార్డులు తారుమారు చేస్తూ ప్రభుత్వ భూములను పట్టాగా మార్చేస్తున్నారు. ఇందుకు ప్రతిఫలంగా పెద్దమొత్తంలో లబ్ధిపొందుతున్నారు. ఈ అక్రమాలపై పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆచార్య వినోబాభావే పిలుపు మేరకు 1954లో జిల్లా వ్యాప్తంగా 168 మంది దాతలు 21,931.03 ఎకరాల భూమిని భూదాన్‌ యజ్ఞబోర్డుకు దానం చేశారు. మొట్టమొదట వెదిరే రామచంద్రారెడ్డి వంద ఎకరాలు దానం చేశారు. ఇలా దాతలు బహూకరించిన భూమిలో కొంత భాగాన్ని 9,678 మంది స్థానిక పేదలకు బోర్డు అసైన్‌ చేసింది. వీటిని అమ్మడం, కొనడం నేరం. కానీ 22– ఏ జాబితాలో ఉండాల్సిన విలువైన భూములు పట్టాగా మారాయి. ప్రస్తుతం ఏడు వేల ఎకరాలకే పరిమితమయ్యాయి. వీటిలోనూ చాలా వరకు వివాదాల్లో చిక్కుకున్నాయి.

పేదలు వర్సెస్‌.. రియల్టర్లు

హయత్‌నగర్‌ మండలం కుంట్లూరులోని 214 నుంచి 224 వరకు ఉన్న సర్వే నంబర్లలో వంద ఎకరాల భూదాన్‌ భూములు ఉన్నాయి. సీపీఐ ఆధ్వర్యంలో నాలుగేళ్ల క్రితం మూడు వేల మందికిపైగా పేదలు ఇందులో గుడిసెలు వేశారు. ఈ భూములు తమవేనంటూ స్థానికంగా ఉన్న కొంత మంది పత్రాలు సృష్టించారు. గత శనివారం ఇక్కడ వెలుగు చూసిన అగ్ని ప్రమాదంలో 300పైగా గుడిసెలు పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే.

కబ్జాదారుల చెరలోనే..

మహేశ్వరం మండలం మంఖాల్‌ సర్వే నంబర్‌ 435లో 12 ఎకరాల భూదాన్‌ భూములున్నాయి. 1955– 58 చేసాల పహాణి ప్రకారం ఈ భూమి ఫకీర్‌ మహ్మద్‌ పేరున ఉంది. ఆయన దీన్ని భూదాన్‌ బోర్డుకు ఇచ్చారు. 1979– 80 నుంచి 1985– 86 వరకు భూదాన సమితి పేరున రికార్డయింది. ఆ తర్వాత బోర్డు ఈ భూమిని స్థానికంగా ఉన్న నలుగురు పేదలకు అసైన్‌ చేసింది. అనంతరం ఈ భూమి పక్కనే ఉన్న ప్రైవేటు పట్టా భూ యజమాని చేతుల్లోకి వెళ్లింది. శేరిలింగంపల్లి మండలం వట్టినాగులపల్లి సర్వే నంబర్లు 186, 187, 188, 189లలో 29.27 ఎకరాల భూదాన్‌ భూములు అన్యాక్రాంతమయ్యాయి.

పరిహారం స్వాహా..

యాచారం మండ లం తాడిపర్తికి చెందిన బొక్క సీతారెడ్డి కుటుంబం సర్వే నంబర్‌ 104లో 250 ఎకరాలను భూదాన్‌ బోర్డుకు దానం చేసింది. యాచారం రెవెన్యూ రికార్డుల్లో 2020 వరకు ఇవి భూదాన్‌ బోర్డు పేరునే ఉన్నాయి. అనంతరం కొంత మంది పెద్దలు వీటిని పట్టా భూములుగా మార్చేశారు. ఈ భూములను ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించడంతో అప్పటికే వీటిని ఆక్రమించిన వారు పరిహారం పొందారు. ఇలా 78 మంది స్థానికేతరులు ఎకరానికి రూ.12.50 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు తీసుకున్నారు.

కందుకూరులోనూ విచారణ

కందుకూరు మండలం తిమ్మాపూర్‌లోని 6, 129, 130, 147, 161, 167, 197, 444, 453, 454, 473, 474, 475 సర్వేనంబర్లలో 111 ఎకరాల భూదాన్‌ భూములు ఉన్నాయి. ఇక్కడ ఎకరం రూ.2 కోట్లకు పైగా పలుకుతోంది. 1951 భూదాన ఉద్యమంలో భాగంగా భారీగా భూములున్న పలువురు రైతులు కొంత భూమిని బోర్డుకు రాసిచ్చారు. ఆ తర్వాత బోర్డు స్థానికంగా ఉన్న పేదలకు పంపిణీ చేసింది. కొంత మంది రియల్టర్లు తక్కువ ధరకే వీటిని కొట్టేశారు. ధరణిని అడ్డం పెట్టుకుని పట్టా భూములుగా మార్చారు.

మోకిల భూములపై స్టే

శంకర్‌పల్లి మండలం కొండకల్‌– మోకిల సరిహద్దులో 76.24 ఎకరాల బిలాదాఖలా భూములు ఉన్నాయి. 45 మంది స్థానిక రైతులు ఇందులో సాగు చేసేవారు. కొంత మంది రియల్టర్లు తక్కువ ధరకే వీటిని తీసుకున్నారు. అనంతరం 2022 డిసెంబర్‌ 29న విలేజ్‌ మ్యాప్‌లో సవరణ చేయడంతో పాటు సర్వే నంబర్‌ 555 సృష్టించి, బైనంబర్లు వేసి పట్టాగా మార్చేశారు. ఇలా ఇప్పటికే 26 ఎకరాలను రియల్టర్లకు కట్టబెట్టారు. కలెక్టర్‌ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌పై ఆగ్ర హం వ్యక్తంచేసిన హైకోర్టు దీనిపై స్టే విధించింది.

హైకోర్టు నోటీసులు

మహేశ్వరం మండలం నాగారం సర్వే నంబర్లు 181, 182, 194, 195లో వంద ఎకరాలకుపైగా భూదాన్‌ భూములున్నాయి. వీటిని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయకపోవడం కబ్జాదారులకు కలిసొచ్చింది. అత్యంత విలువైన ఈ భూములపై కొంతమంది అక్రమార్కుల కన్నుపడింది. తప్పుడు పత్రాలు సృష్టించి పట్టా భూములుగా మార్చేశారు. అనంతరం తక్కువ ధరకే అమ్మకానికి పెట్టడంతో ప్రభుత్వ శాఖల్లోని కీలక పదవుల్లో ఉన్నవారు తమ కుటుంబ సభ్యుల పేర్లతో పది నుంచి ఇరవై గుంటల చొప్పున కొనుగోలు చేశారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లడంతో ఇటీవల హైకోర్టు వీరందరికీ నోటీసులు చేసింది.

అక్రమాలకు పట్టా!1
1/2

అక్రమాలకు పట్టా!

అక్రమాలకు పట్టా!2
2/2

అక్రమాలకు పట్టా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement