
ఇక భూ సమస్యలుండవ్
శాశ్వత పరిష్కారానికే ‘భూ భారతి’ అమలు
● ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి ● అబ్దుల్లాపూర్‌మెట్, కందుకూరులో అవగాహన సదస్సులు
అబ్దుల్లాపూర్‌మెట్: నిర్దిష్టమైన గడువులోపు రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని తార కన్వెన్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చట్టంలోని మార్గదర్శకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కలెక్టర్ నారాయణరెడ్డి వీటిని క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సామాన్యులకు సైతం అర్థమయ్యేలా భూభారతి పోర్టల్‌ను రూపొందించారన్నారు. దీనిద్వారా రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. త్వరలోనే రెవెన్యూ అధికారులు గ్రామాలకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు.
రెండంచెల వ్యవస్థ..
ధరణిలో రైతులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం అన్ని అంశాలను పొందుపరుస్తూ భూభారతిని తెచ్చిందని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. దీనిద్వారా సెక్షన్– 4లోని సబ్ సెక్షన్లు 4, 5 ప్రకారం భూ రికార్డులను సవరించుకునే అవకాశం కల్పించారని వివరించారు. భూ విస్తీర్ణంలో మార్పులు, రికార్డుల్లో నమోదు కాని విస్తీర్ణం వంటి సమస్యలను తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో పరిశీలించి, పరిష్కరించే అధికారులు ఇచ్చిందన్నారు. మే, జూన్ మాసాల్లో అన్ని రెవెన్యూ గ్రామాల్లోనూ సదస్సులు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ స్పష్టంచేశారు. భూభారతి చట్టంలో రెండంచెల అప్పీలు వ్యవస్థను ఉంటుందని వివరించారు. తహసీల్దార్ స్థాయిలో చేసుకున్న దరఖాస్తులకు సంబంధించి రైతు సంతృప్తి చెందకపోతే 60 రోజుల్లోపు ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవచ్చని, అక్కడ కూడా న్యాయం జరగలేదని భావిస్తే.. 30 రోజుల్లోపు కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్ తరహాలోనే భూకమతాల వారీగా భూధార్ సంఖ్య కేటాయిస్తారని కలెక్టర్ తెలిపారు. భూముల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని నెదర్లాండ్ మాజీ మంత్రి బెర్త్ కోలేందేర్స్ అన్నారు. భూ భారతి చట్టాన్ని తమ దేశంలోనూ అమలు చేసేందుకు అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. సదస్సులో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి, తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.