
సాగర్‌రోడ్డుపై ఉద్రిక్తత
హోంగార్డ్ కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువుల ధర్నా
యాచారం: మండలంలోని గునుగల్ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డ్రైనేజీ కాల్వ నిర్మాణం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి గ్రామానికి చెందిన హోంగార్డ్ మేడిపల్లి వెంకటేశ్ ఛాతిలో నొప్పితో ఆస్పత్రికి తరలిస్తుండగా ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే ఊరికి చెందిన ప్రశాంత్, పవన్‌ల కుటుంబ సభ్యులు కొట్టడంతోనే హోంగార్డ్ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు బాధితులు ఆరోపించారు. తమని ఆదుకోవాలని సోమవారం సాయంత్రం గునుగల్ గేట్ వద్ద సాగర్‌రోడ్డుపై మృతుడి భార్య స్వాతి, పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. వందలాది మంది రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో సాగర్ రహదారి ఇరువైపులా భారీగా ట్రాఫిక్‌జాం అయింది. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని, ఘర్షణ పడిన వారిని అదుపులోకి తీసుకు న్నామని తెలియజేశారు. అయినా ఆందోళనకారులు వినకపోవడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు మృతుడి బంధువులు ఉదయం ప్రశాంత్, పవన్‌ల ఇళ్లల్లోని వస్తువులకు నిప్పు పెట్టే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో గ్రామంలో పోలీసుల పహారా ఏర్పాటు చేశారు.
ఇరువైపులా ట్రాఫిక్ జామ్ ఇబ్రహీంపట్నం ఏసీపీ చొరవతో
శాంతించిన ఆందోళనకారులు

సాగర్‌రోడ్డుపై ఉద్రిక్తత