
దైవ దర్శనానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి
శివ్వంపేట(నర్సాపూర్): దైవ దర్శనానికి వచ్చిన వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధి చాకరిమెట్ల అటవీ ప్రాంతంలో తూప్రాన్– నర్సాపూర్ హైవే పై శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్ చింతల్ ప్రాంతానికి చెందిన గొల్ల లోకేశ్ (42) లిఫ్ట్ రిపేర్లు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం చాకరిమెట్లలోని ఆంజనేయస్వామి దర్శనం కోసం ఒక్కడే బస్సులో వచ్చాడు. అక్కడి నుంచి లక్ష్మాపూర్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి తెలిపారు.
సిద్దిపేట అనారోగ్యంతో..
సిద్దిపేటకమాన్: అనారోగ్యంతో వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం మేరకు.. భువనగిరికి చెందిన ఎండీ నవాజ్ (40) ఏడాదిగా పట్టణంలోని ఓ హోటల్‌లో పని చేస్తూ స్థానికంగా నివాసం ఉంటున్నాడు. కొన్ని నెలల కిందట క్యాన్సర్ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్నాడు. దీంతో హోటల్‌లో పని మానేశాడు. అనారోగ్యంతో బాధపడుతూ కరీంనగర్ రోడ్డు డివైడర్ పక్కన నవాజ్ మృతి చెంది పడి ఉన్నట్లు స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న హోటల్ యజమాని జాకీర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి
కౌడిపల్లి(నర్సాపూర్): అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందినట్లు శనివారం కౌడిపల్లి ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. మండలంలోని శేరితండా పంచాయతీ వసురాంతండాకు చెందిన దుంగావత్ గేమ్‌సింగ్(35) కొన్నేళ్లుగా భార్యతో కలిసి గుమ్మడిదలలో ఉంటున్నాడు. 18 తండాలో చిట్టీ డబ్బులు కట్టాలని రూ.40 వేలు తీసుకొని గ్రామానికి వచ్చాడు. రాత్రి తండాకు చెందిన మోహన్, సలాబత్‌పూర్‌కు చెందిన జహీర్‌తో కలిసి మద్యం సేవించాడు. అనంతరం దాబాలో భోజనం చేస్తుండగా గేమ్‌సింగ్ అకస్మాత్తుగా కింద పడిపోయాడు. వెంటనే కౌడిపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెదక్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. తన భర్త వెంట ఉన్న వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి భార్య శాంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.