
సాగు చట్టాలపై అవగాహన ఉండాలి
వ్యవసాయ అధికారి శివప్రసాద్
జహీరాబాద్ టౌన్: వ్యవసాయ చట్టాలపై డీలర్లకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ సూచించారు. మండలంలోని రంజోల్ రైతు వేదికలో బుధవారం విత్తనాలు, ఎరువులు, పురుగు మందు చట్టాలపై డీలర్లకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులే లక్ష్యంగా వ్యవసాయ చట్టాలు తయారు చేసినట్లు చెప్పారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయించకూడదని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మాల ని వివరించారు. దుకాణాల్లో విత్తనాలు, ఎరువుల నిల్వల పట్టిక ఏర్పాటు చేయాలని సూచించారు. విత్తనాలు కొంటే ఎరువులు ఇస్తామని ఎవరైనా డీలర్లు రైతులకు షరతులు పెడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ రోజు వ్యవసాయ అధికారులు దుకాణాలను తనిఖీలు నిర్వహిస్తారని, వారికి సహకరించాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో విత్తనాల కొరతలేదని చెప్పారు. సమావేశంలో వ్యవసాయ అధికారులు లావణ్య,అభినాష్ వర్మ, హసునుద్దీన్, వినోద్‌కుమార్,రంజోల్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి ప్రదీప్‌కుమార్ నియోజకవర్గంలోని డీలర్లు పాల్గొన్నారు.