
జల్సాలకు అలవాటు పడి ట్రాక్టర్ చోరీ..
● అంతర్‌జిల్లా దొంగను పట్టుకున్నత్రీటౌన్ పోలీసులు ● వివరాలు వెల్లడించిన ఏసీపీ మధు
సిద్దిపేటఅర్బన్: జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను గురువారం సిద్దిపేట త్రీటౌన్ పోలీసులు పట్టుకున్నారు. సిద్దిపేట ఏసీపీ మధు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా ఇస్సానగర్‌కు చెందిన చెవుల మల్లేశం (40) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసుకుంటూ వ్యవసాయం చేస్తున్నాడు. కుటుంబ పోషణ భారం కావడంతో జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు చేస్తున్నాడు. తన సమీప గ్రామాల్లో దొంగతనం చేస్తే పోలీసులకు దొరికిపోతాననే భయంతో దూర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ ముందు రోజు రెక్కీ నిర్వహించి అనంతరం దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో కొండపాక మండలం మర్పడగ మధరి దోమలోనిపల్లి గ్రామంలో దోమల మల్లయ్య వ్యవసాయ పొలం వద్ద ఉన్న ట్రాక్టర్ ట్రాలీని అపహరించాడు. అంతకుముందు ఫిబ్రవరి 12న రాంపల్లి గ్రామ శివారులోని బొమ్మ నర్సయ్య పొలం వద్ద నిలిపి ఉంచిన జాన్‌డీర్ ట్రాక్టర్‌ను ట్రాలీతో సహా దొంగిలించి తన స్వగ్రామంలోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. ట్రాక్టర్‌ను గుర్తు పట్టకుండా నంబర్ ప్లేట్‌కు రంగులు వేసినట్టు పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకోవడానికి త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ ప్రత్యేక బృందంతో నిందితుడి కోసం గాలించారు. ఈ క్రమంలో సెలంపు గ్రామ శివారులో ట్రాక్టర్ ఇంజిన్‌తో సహా ప్రయాణిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి జాన్ డీర్ ట్రాక్టర్ ఇంజిన్, రెండు ట్రాలీలు, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. నేరస్తుడు పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 15 దొంగతనాలు చేసి జైలుకు వెళ్లాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకున్న త్రీటౌన్ సీఐ విద్యాసాగర్, సిబ్బంది తిరుపతిరెడ్డి, బాబు, శ్రీనివాస్‌లను ఏసీపీ అభినందించారు.