
వరికోత.. కన్నీటి వెత
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు దుబ్బాకకు చెందిన కేసుగారి స్వామి. తనకున్న 12 ఎకరాల్లో ఈ యాసంగిలో వరి వేశాడు. తీరా వరి కోద్దామంటే వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు చేలలో నీరు నిలిచిపోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితిలో చైన్ హార్వెస్టర్‌తో కోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా 12 ఎకరాలు కోసేందుకు కామన్ హార్వెస్టర్‌తో 14 గంటలు పట్టేది. ఇప్పుడు చైన్ మిషన్‌తో కోస్తే 18 గంటలకు పైగా సమయం పట్టింది. వరి కోసి వడ్లను రోడ్డుపైకి తెచ్చి ట్రాక్టర్‌లో పోయాల్సి రావడంతో అదనంగా 5 గంటలకు పైగా సమయం ఎక్కువైంది. పైగా కామన్ హార్వెస్టర్‌కు గంటకు రూ.2 వేలు ధర ఉంటే చైన్ మిషన్‌కు రూ.3 వేలకు పైగా ఉంది. దీంతో రూ.26 వేలలో పూర్తి కావాల్సిన కోతకు రూ.50 వేలకు పైగా అంటే అదనంగా రూ.24 వేలు అదనపు భారం పడింది. ప్రతిసారి వడ్లు 20 ట్రాక్టర్లకు పైగా అంటే 350 క్వింటాళ్ల వరకు అయ్యేవి. ఇప్పుడు తక్కువయ్యాయి. ఇది ఒక్క రైతు స్వామిదే కాదు చాలామంది రైతులది ఇదే పరిస్థితి.
చైన్‌మిషన్‌తో కోయించా..
వరుసగా వానలు పడటంతో కోత కొచ్చిన వరిపంట కోసేందుకు చాలా ఇబ్బందులు పడ్డా. వానలతో భూమి ఆరలేదు. మళ్లీ వాన వానలు వస్తుండటంతో ఎక్కువ డబ్బులు పోయినా ఉన్న పంటను దక్కించుకోవాలనే చైన్‌మిషన్‌తో కోయించా. నేనే కాదు రైతులందరూ చైన్‌మిషన్, ఫోర్‌వీల్‌తోనే కోయించుకుంటున్నారు.
– గన్నె వెంకట్రాజిరెడ్డి, రైతు
అకాల వర్షాలతో ఇబ్బందులు
తీరా పంటలు చేతికొచ్చే దశలో అకాల వర్షాలు రైతులను ఇబ్బందుల పాలుజేస్తున్నాయి. వడగండ్లు, ఈదురు గాలులతో కూడిన వర్షాలతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రైతులకు పంట నష్టం వాటిల్లింది. ఈ అకాల వర్షాలతో కోసిన వడ్లు ఆరబోసేందుకు , వరి కోతలు కోసేందుకు కూడా అదనంగా ఖర్చులు అవుతున్నాయి.
– రాధిక,జిల్లా వ్యవసాయ అధికారి
వరి కోసేందుకు నరకయాతన
దుబ్బాక: అసలే యాసంగిలో భూగర్భజలాలు అడుగంటి బోర్లు వట్టిపోయి చాలా పంటలు ఎండిపోయాయి. ఇక పంట చేతికొస్తదనుకున్న దశలోనే జిల్లాలో వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వడగండ్లతో వడ్లు చాలా వరకు వడ్లు రాలిపోవడంతో రైతులకు కనీస పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి దాపురించింది. పోగా మిగిలిన గింజలను కోద్దామంటే వారం పదిరోజులుగా వరుసగా పడుతున్న వానలకు పొలాలు ఆరక దిగబడుతుండటంతో కోతలకు ఇబ్బంది అవుతోంది. దీంతో వరి కోసేందుకు రైతులు నరకయాతన పడుతున్నారు. టైర్ హార్వెస్టర్లు దిగబడుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ ధర పెట్టి చైన్ మిషన్లతోనే కోతలు కోయించాల్సిన పరిస్థితి దాపురించింది. జిల్లాలోని ఒక్క దుబ్బాకనే కాకుండా సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో వరి కోతలు కోసేందుకు రైతులు నరకయాతన పడుతున్నారు.
జిల్లాలో 45 శాతానికి పైగా వరికోతలు
జిల్లాలో ఈ యాసంగిలో 3.53 లక్షల ఎకరాల్లో వరిపంట వేయగా ఇప్పటి వరకు 45 శాతం వరకు అంటే సుమారుగా 1.45 లక్షలకు పైగా ఎకరాల్లో కోతలు కోయడం పూర్తయింది. ఇంకా 55 శాతం వరకు కోతలు కోయాల్సి ఉంది. కోసిన కోతల్లో 20 శాతం వరకు చైన్‌మిషన్లు, ఫోర్‌వీల్‌తోనే కోశారు. దీంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
రైతులపై అదనపు భారం
పొలాలు దిగబడుతుండటంతో చైన్‌మిషన్‌తో కోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హార్వెస్టర్‌కు గంటకు రూ.2వేలు ఉండగా చైన్ మిషన్ గంటకు రూ.3వేల నుంచి 3500 వరకు ధర చెల్లించాల్సి వస్తోంది. పొలాలు దిగబడుతుండటంతో వడ్లు పోసేందుకు ట్రాక్టర్లు రాలేని పరిస్థితి ఉంది. సాధారణంగా ఎకరం వరికోతకు టైర్ హార్వెస్టర్‌తో గంట 10 నిమిషాల నుంచి 1.20 పడుతుండగా చైన్ మిషన్‌తో ఎకరం వరికోసి వడ్లు బయట పోయాల్సి వస్తుండటంతో 2 గంటలకు పైగా సమయం పడుతోంది. అంతేకాకుండా చైన్‌మిషన్‌కు రేటు కూడా ఎక్కువ ఉండటంతో ఎకరానికి రైతుకు అదనంగా 5 నుంచి 6 వేల వరకు భారం పడుతోంది. రైతులు చైన్‌మిషన్‌తోనే కోయిస్తుండటంతో అవి దొరకక ప్రతిరోజు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రైతులను కోలుకోకుండాచేస్తున్న అకాల వర్షాలు భూమిలో తేమతో దిగబడుతున్నహార్వెస్టర్లు చైన్‌మిషన్లతో వరి కోతలు ఎకరానికి రూ.5 వేలకు పైగాఅదనపు భారం జిల్లాలో ఇప్పటి వరకు 45 శాతం కోతలు

వరికోత.. కన్నీటి వెత

వరికోత.. కన్నీటి వెత

వరికోత.. కన్నీటి వెత