
త్వరలో వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన
ఎస్‌డబ్ల్యూజీ కార్యదర్శి అలుగు వర్షిణి
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని తోటపల్లి శివారులో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ కళాశాలకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర సాంఘీక, సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి అలుగు వర్షిణి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ మనుచౌదరి, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షిణి మాట్లాడుతూ.. రూ.100 కోట్లతో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు పాలన అనుమతులు ఎమ్మెల్యే చొరవతో ప్రభుత్వం నుంచి వచ్చినట్లు తెలిపారు. పది రోజుల్లో సంబంధిత భూమిని కలెక్టర్ అందిస్తారన్నారు. మే నెలలో 47 కోట్లు వెచ్చించి కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించనున్నట్లు తెలిపారు. గురుకులాల్లో చదివిన విద్యార్థులకు ఈ కళాశాలలో 75 శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భవన నిర్మాణం పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచి ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్, ఏఎంసీ చైర్మన్ కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్, మండల అధ్యక్షుడు రత్నాకర్‌రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, శ్రీనివాస్ గౌడ్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.