
మహిళల రక్షణకు పెద్దపీట
● సమావేశంలో సీపీ అనురాధ
సిద్దిపేటకమాన్: మహిళల రక్షణకు పెద్దపీట వేయాలని సీపీ అనురాధ పేర్కొన్నారు. శుక్రవారం పోలీసు కమిషనరేట్‌లో హుస్నాబాద్ డివిజన్ పోలీసు అధికారులతో పెండింగ్ కేసులపై సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీసీటీఎన్‌ఎస్ డాటా ప్రకారం క్రైమ్ రివ్యూ నిర్వహించనున్నట్లు తెలిపారు. నూతన టెక్నాలజీ ఉపయోగించడం, నేర్చుకోవడం చాలా ముఖ్యమన్నారు. రౌడీలు, అనుమానితులను తనిఖీ చేసి వారిపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లపై రైతులు ధాన్యం ఆరబెట్టకూడదని సూచించారు. అడవిపందుల నుంచి పంట రక్షణ కోసం చుట్టూ కరెంటు వైర్లు ఏర్పాటు చేస్తున్నారని రైతులను పిలిచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులను విచారణ చేసి త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. సమావేశంలో హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, సీఐలు శ్రీనివాస్, శ్రీను, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నీట మునిగి వ్యక్తి మృతి
పాపన్నపేట(మెదక్): దర్శనానికి వచ్చిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల ఆలయం వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మరికెల్ గ్రామానికి చెందిన వీరస్వామి (40) తన భార్యాపిల్లలతో కలిసి బంధువుల విందులో పాల్గొనడానికి ఽఽశుక్రవారం ఏడుపాయలకు వచ్చాడు. అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు చెక్‌డ్యాంలో స్నానం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.
ఏడుపాయల్లో
మృతదేహం గుర్తింపు
● కుళ్లిపోవడంతో అక్కడే పోస్టుమార్టం
● అనంతరం పూడ్చివేసిన పోలీసులు
హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని గంగాపూర్ గ్రామానికి చెందిన మహేశ్(37)ను గత నెల 26న నగల కోసం తీసుకొచ్చి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు పాపన్నపేట మండలం ఏడుపాయల శివారులోని మొదటి బ్రిడ్జి వద్ద హత్య చేసినట్లు అక్కడ ఉన్న ఆనవాళ్లను బట్టి మహేశ్ మృతదేహంగా గుర్తించారు. శవం కుళ్లిపోయి ఉండటంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి పూడ్చివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.
వ్యక్తి మృతదేహం లభ్యం
చేగుంట(తూప్రాన్): మండల కేంద్రం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి వివరాల ప్రకారం... చేగుంట శివారులోని మక్కరాజీపేట బ్రిడ్జీ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. కాగా మృతుడికి సంబంధించిన వివరాలు తెలియలేదు. మృతుడు గోధుమరంగు చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించినట్లు తెలిపారు.
కోల్డ్ స్టోరేజీ గోదాం ప్రమాదానికి కారణమైన వ్యక్తి అరెస్టు
కొండపాక(గజ్వేల్): అరటి పండ్ల కోల్డ్ స్టోరేజీ గోదాంలో అగ్ని ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ కథనం ప్రకారం... కొండపాక మండలంలోని మర్పడ్గ గ్రామ శివారులో సిద్దిపేటకు చెందిన వ్యాపారులు అరటి పండ్ల కోల్డ్ స్టోరేజీ గోదాంను ఏర్పాటు చేశారు. ఈనెల15న కోల్డ్ స్టోరేజీ పక్కన భూమిని కౌలుకు తీసుకున్న రైతు రాజయ్య ఖరీఫ్ సీజన్ పనుల కోసం పత్తి పొరకకు నిప్పంటించాడు. మంటలు ఒక్కసారిగా కోల్డ్ స్టోరేజీ గోదాంలోకి ప్రవేశించి రూ. 1.50 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఈ క్రమంలో నిర్వాహకుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ ఫిర్యాదు మేరకు రాజయ్యపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అరటి పండ్లను ఇవ్వడం లేదన్న కక్షతో గోదాం పక్కన పత్తి పొరకకు నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. రాజయ్య పరారీలో ఉండటంతో శుక్రవారం అరెస్టు చేశారు.

మహిళల రక్షణకు పెద్దపీట