
Photo Courtesy: BCCI
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన కేకేఆర్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో స్థాయికి తగ్గట్టుగా ఆడటం లేదు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓటమిపాలైంది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో చావుదెబ్బ తిన్న ఆ జట్టు.. ఆతర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఏకపక్ష విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. తాజాగా నిన్న (మార్చి 31) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొని సీజన్‌లో రెండో ఓటమిని మూటగట్టుకుంది.
ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. ముంబై ఇండియన్స్ అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ (3-0-24-4) ధాటికి 116 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రాణించలేదు. అంగ్‌క్రిష్ రఘువంశీ చేసిన 26 పరుగులే అత్యధికం. ఆఖర్లో రమణ్‌దీప్ సింగ్ (12 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించకపోయుంటే 100 పరుగులు కూడా వచ్చేవి కాదు.
రఘువంశీ, రమణ్‌దీప్‌తో పాటు మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. డికాక్ (1), నరైన్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), ఆండ్రీ రసెల్ (5) దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్‌తో పాటు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) కూడా సత్తా చాటారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనుకు దిగిన ముంబై ఇండియన్స్ సునాయాసంగా విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసం సృష్టించాడు.
రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. మొత్తంగా ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్‌కు 2 వికెట్లు దక్కాయి.
మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ అజింక్య రహానే ఇలా అన్నాడు. సమిష్టిగా బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. టాస్‌లో చెప్పినట్లుగానే ఈ వికెట్ బ్యాటింగ్ చేయడానికి బాగుంది. 180-190 పరుగులు చేసుంటే మంచి స్కోర్ అయ్యుండేది. వికెట్‌పై మంచి బౌన్స్ కూడా ఉంది. కొన్నిసార్లు బౌన్స్‌ను, పేస్‌ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆట నుండి చాలా వేగంగా నేర్చుకోవాలి.
బంతితో కూడా పెద్దగా రాణించలేకపోయాము. బౌలర్లు శక్తి మేరకు ప్రయత్నించారు కానీ, బోర్డుపై ఓ మోస్తరు స్కోరైనా లేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాము. పవర్‌ప్లేలో నాలుగు వికెట్లు కోల్పోయాక కోలుకోవడం కష్టం. మంచి భాగస్వామ్యాలు కొనసాగుండాల్సింది. చివరి వరకు ఓ బ్యాటర్ క్రీజ్‌లో ఉండటం అవసరం.