
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌ను ముంబై ఇండియన్స్ చెత్తగా ప్రారంభించి, తిరిగి గాడిలో పడింది. తొలి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు పరాజయాల తర్వాత వరుసగా నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఆ జట్టుకు పడి లేవడం కొత్త కాదు. గతంలో చాలా సీజన్లలో ఇలాగే తొలుత పరాజయాలు ఎదుర్కొని ఆతర్వాత టైటిల్ రేసులో నిలిచింది. ప్రస్తుత సీజన్‌లోనూ ముంబై ఇండియన్స్ అదే ఒరవడిని కొనసాగిస్తుంది.
ఆ జట్టు ఆటగాళ్లు ఒక్కసారి ఊపులోకి వస్తే వార్ సైడ్ అవుతుంది. ఇది మరోసారి నిరూపితమైంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ విఫలం కావడం.. బ్యాటర్లలో పెద్దగా ఆత్య విశ్వాసం లేకపోవడం.. పేసర్లు లయను అందిపుచ్చుకోలేకపోవడం, బుమ్రా అందుబాటులో లేకపోవడం వంటివి జరిగాయి. ఈ కారణాల చేత ముంబై తొలి మ్యాచ్‌ల్లో వరుస పరాజయాలు ఎదుర్కొంది.
అయితే ప్రస్తుతం సీన్ మారిపోయింది. రోహిత్ శర్మ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. బుమ్రా జట్టులో చేరడమే కాకుండా, సామర్థ్యం మేరకు సత్తా చాటుడుతున్నాడు. బ్యాటర్లు తిరిగి ఆత్మ విశ్వాసాన్ని పొందారు. బౌలర్లు, ముఖ్యంగా పేసర్లు లయను అందుకున్నారు. దీపక్ చాహర్, సూర్యకుమార్, బౌల్ట్, మిచెల్ సాంట్నర్ అత్యుత్తమంగా రాణిస్తున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవకాశం వచ్చిన ప్రతిసారి చెలరేగుతున్నాడు.
నిన్న (ఏప్రిల్ 23) సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పైన పేర్కొన్న ఆటగాళ్లంతా తలో చేయి వేయడంతో ముంబై ఇండియన్స్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ సీజన్‌లో ముంబై సన్‌రైజర్స్‌ను ఓడించడం ఇది రెండో సారి. నిన్నటి మ్యాచ్‌లో టాస్ గెలిచి సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన ముంబై.. ఆ జట్టును స్వల్ప స్కోర్‌కే పరిమతం చేసింది.
పేసర్లు బౌల్ట్, చాహర్ చెలరేగడంతో సన్‌రైజర్స్ 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి 100 పరుగులైనా చేస్తుందా అనిపించింది. అయితే క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) ఆదుకోవడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగలిగింది. బౌల్ట్ 4, చాహర్ 2, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ తీసి సన్‌రైజర్స్ పుట్టి ముంచారు.
అనంతరం ఛేదనలో ముంబై ఆదిలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయినా.. రోహిత్ (46 బంతుల్లో 70).. విల్ జాక్స్‌తో (22) పాటు ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. జాక్స్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్) తన సహజ శైలిలో రెచ్చిపోయి బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు. రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి విజయానికి చేరువలో ఔటయ్యాడు.

ముంబై మరో 26 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ జట్టు చివరిగా 2020 సీజన్‌లో నాలుగు అంతకంటే ఎక్కువ విజయాలు సాధించింది. ఆ సీజన్‌లో ముంబై వరుసగా 5 మ్యాచ్‌ల్లో గెలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అదే ముంబై ఇండియన్స్‌ను చివరి (ఐదో) టైటిల్.