
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఐపీఎల్ -2025 (IPL 2025)కి సన్నద్ధమవుతున్నాడు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఉన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) సారథిగా బరిలోకి దిగనున్నాడు. ఈ ఉత్తరాఖండ్ ఆటగాడి కోసం లక్నో ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది.
సమతూకంగా
తద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన క్రికెటర్‌గా పంత్ నిలిచాడు. ఇక ఈ సీజన్‌లో తాము రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగబోతున్నామన్న పంత్.. సీనియర్లు, యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు.
నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అందుబాటులో ఉండటం తమకు సానుకూలాంశమని పేర్కొన్నాడు.
‘‘జట్టులోని ప్రతి ఒక్కరు తమ నైపుణ్యాలను ప్రదర్శరించే విధంగా.. తమలోని అత్యుత్తమ ప్రదర్శనను వెలికి తీసేలా.. అందుకు తగ్గట్లుగా డ్రెసింగ్ రూమ్ వాతావరణం ఉండేలా మేము చూసుకుంటున్నాం.
మా మేనేజ్‌మెంట్ అన్ని రకాలుగా ఆటగాళ్లకు అండగా ఉంటుంది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు నిక్కీ, మార్క్రమ్, మిల్లర్ ఉండటం మాకు కలిసి వస్తుంది’’ అని పంత్ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో తమ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది.
Oh Captain… My Captain! 💙 pic.twitter.com/Qkite1n4bh
— Lucknow Super Giants (@LucknowIPL) March 17, 2025
ఇదిలా ఉంటే.. ఓ బ్రాండ్ షూట్‌లో భాగంగా రిషభ్ పంత్ వ్యవహరించిన తీరు వైరల్‌గా మారింది. టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ తనను ఉద్దేశించి విమర్శించిన మాటలను పునరావృతం చేస్తూ పంత్ వ్యాఖ్యానించడంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్’’
అసలేం జరిగిందంటే.. ఆస్ట్రేలియా గడ్డ మీద రిషభ్ పంత్‌కు మంచి రికార్డు ఉన్న విషయం తెలిసిందే. అయితే, గతేడాది కంగారూ దేశ పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో పంత్ తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.
'ముఖ్యంగా మెల్‌బోర్న్ టెస్టులో అతడు అవుటైన తీరు విమర్శలకు దారి తీసింది. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో పంత్ వికెట్ పారేసుకున్న తీరుపై కామెంటేటర్ గావస్కర్ తీవ్ర స్థాయిలో అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్’’ అంటూ పంత్ తీరును విమర్శించాడు.
రీక్రియేట్ చేసిన పంత్
ఇప్పుడు అదే మూమెంట్‌ను పంత్ రీక్రియేట్ చేశాడు. తనదైన శైలిలో.. ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ‘‘ఎన్నోసార్లు నిన్ను సమర్థించి, నీకు మద్దతుగా నిలిచిన గావస్కర్ సార్‌నే ఇలా ఇమిటేట్ చేసి అవమానిస్తావా?’’ అంటూ కొంత మంది కామెంట్ చేస్తున్నారు.
మరికొందరు మాత్రం.. ‘‘ఐకానిక్ మూమెంట్‌ను పంత్ క్యాష్ చేసుకుంటున్నాడు. ఇందులో గావస్కర్‌ను అవమానించిట్లు ఏమీ లేదు’’ అని పంత్‌కు సపోర్టు చేస్తున్నారు.
Rishabh Pant recreating the 'Stupid, Stupid, Stupid!' of Sunil Gavaskar. 🤣pic.twitter.com/JhrK34luWh
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2025
కాగా గతేడాది ఐపీఎల్‌లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 446 పరుగులు చేశాడు. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. జట్టును ఆరో స్థానంలో నిలిపి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఇక ఈసారి మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌తో పంత్ తన కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్నాడు.