
కారు డ్రైవర్ దారుణ హత్య
నెల్లూరు(క్రైమ్): ఓ కారు డ్రైవర్‌ను కొందరు దారుణంగా హత్య చేశారు. మృతదేహం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు తొలుత శ్మశానంలో పూడ్చిపెట్టాలని చూశారు. వీలుకాకపోవడంతో చెత్తకుప్పలో పడేసి గోతాన్ని కప్పి పరారయ్యారు. ఈ ఘటన నెల్లూరు ప్రగతినగర్ ఏ బ్లాక్‌లో చోటుచేసుకుంది. గురువారం పోలీసులు, బాధితులు వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం తిరిగలదిన్నె గ్రామానికి చెందిన మాధవ, జ్యోతి దంపతులకు వాసు (23), వాసవి సంతానం. మాధవ కుటుంబం సుమారు 11 సంవత్సరాల క్రితం నెల్లూరు నగరానికి వలసొచ్చింది. వారు ప్రస్తుతం ప్రగతినగర్ ఏ బ్లాక్‌లో నివాసం ఉంటున్నారు. మాధవ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. వాసు కారు డ్రైవర్‌గా పనిచేస్తూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. పలువురితో అతడికి గొడవలున్నాయి.
హత్య చేశారిలా..
పని ఉందంటూ వాసు బుధవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి ఏడు గంటల సమయంలో తండ్రికి ఫోన్ చేసి పనిమీద ఉన్నానని ఇంటికి రావడం ఆలస్యమవుతందని చెప్పాడు. అర్ధరాత్రి ఓ యువకుడిపై వాసు కత్తితో దాడి చేశాడు. సదరు యువకుడు ఈ విషయాన్ని అప్పటికే వాసు వల్ల ఇబ్బందులు పడుతున్న వినయ్, మణికంఠ, లోకేశ్ అలియాస్ ఛత్రపతి, తేజ, సంతోష్‌తోపాటు మరికొందరికి తెలియజేశాడు. అందరూ కలిసి వాసును ఆర్టీసీ బస్టాండ్ వద్ద పట్టుకుని ప్రగతినగర్ ఏ బ్లాక్ పదో వీధిలోని దర్గా వద్దకు తీసుకొచ్చారు. దర్గా ఎదురుగా ఉన్న రోడ్డుపై అతడిని తీవ్రంగా కొట్టి తమ వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని వెంగళరావ్‌నగర్ సమీప చెరువులో పూడ్చిపెట్టేందుకు తీసుకెళ్లగా అక్కడ జనసంచారం ఉండటంతో ప్రగతినగర్ పదో వీధి కింద చెరువు సమీపంలోని చెత్తకుప్పలో పడేశారు. మృతదేహం కనిపించకుండా ఉండేందుకు పెద్ద చెత్తమూటను పైన వేసి పరారయ్యారు.
గుర్తించిన స్థానికులు
గురువారం ఉదయం అటుగా వెళుతున్న స్థానికులు చెత్తకుప్పలో మృతదేహం ఉండటాన్ని గమనించి దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే మృతుడి స్నేహితులు లోకేశ్, బాదుల్లా ఈ విషయాన్ని బాధిత తల్లిదండ్రులకు తెలియజేశారు. నగర డీఎస్పీ పి.సింధుప్రియ, దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్ రోశయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి ఛాతి, పొట్ట, గొంతు ఇలా అనేక చోట్ల పెద్దసంఖ్యలో కత్తిపోట్లు ఉన్నాయి. పేగులు సైతం బయటకు వచ్చి ఉన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న మాధవ, జ్యోతి విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా రోదించారు. మాధవ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. సాంకేతికత ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. వాసు కనిపించిన ప్రతిఒక్కరితో గొడవలు పడుతుండేవాడు. నిందితుల్లో పలువురితో పాతకక్షలున్నట్లు విచారణలో వెల్లడైంది. మూడునెలల క్రితం సారాయంగడి సెంటర్‌లో ఓ స్వీట్ షాపు వద్ద జరిగిన వివాదం కూడా హత్యకు మరో కారణంగా తెలుస్తోంది. పోలీసులు నిందితుల్లో కొందరిని ఇప్పటికే అదుపులోకి తీసుకోగా మిగిలిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల్లో ఓ రౌడీషీటర్ ఉన్నట్లు సమాచారం.
మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేసిన వైనం
పోలీసుల అదుపులో నిందితులు

కారు డ్రైవర్ దారుణ హత్య