
ఆహారం విషయంలో జాగ్రత్త
జిల్లాలో ఇలా..
సమతుల్య ఆహారం తీసుకోవాలి
ఆహారం ద్వారానే ఎక్కువగా లివర్ సమస్యలు వస్తున్నాయి. ప్రాసెస్డ్, ఫ్రిడ్జ్‌లో ఉంచే ఆహారం, బేకరీ ఫుడ్స్ మానాలి. చిన్నపిల్లలకు మంచి ఆహారంపై అవగాహన కల్పించాలి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఓ) సూచించిన ప్రకారం సమతుల్య ఆహారం తీసుకుంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. హెపటైటిస్ సీకి ఇప్పుడు వైద్యం ఉంది. పెద్దాస్పత్రిలో చికిత్స పొందిన వారందరూ కోలుకున్నారు. హెపటైటిస్ బీకి పూర్తి చికిత్స లేకున్నా నియంత్రణకు నాలుగు సంవత్సరాలు మందులు వాడాలి. ఊబకాయం రాకుండా చూసుకోవాలి.
– డాక్టర్ సునీల్, అసోసియేట్ ప్రొఫెసర్, హెపటైటిస్ నోడల్ ఆఫీసర్, సర్వజన ఆస్పత్రి
● ఊబకాయం, మారిన ఆహార అలవాట్లు, జీవనశైలితో పొంచిఉన్న ముప్పు
● జిల్లాలో 3 లక్షల మందికి ఏదో ఒక రకమైన సమస్య
● హెపటైటిస్ బీ, సీ వైరస్‌లతో మరింత డ్యామేజీ
● 2025 సంవత్సర థీమ్ ‘ఆహారమే ఔషధం’
నెల్లూరు(అర్బన్): కాలేయం (లివర్).. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. ఆహారం జీర్ణమై చివరికి పిండి పదార్థాలుగా, కొవ్వు ఆమ్లాలుగా, ప్రోటీన్లుగా మారి రక్తంలో కలవాలంటే ఇది సక్రమంగా పని చేయాలి. అయితే మారిన ఆహార అలవాట్లు, జీవనశైలి వల్ల లివర్ అనారోగ్యానికి గువుతోంది. హెపటైటిస్ బీ, సీ వైరస్‌ల వల్ల కూడా పాడువుతోంది. సిర్రోసిస్ ఆఫ్ లివర్‌గా మారితే రూ.20 లక్షలకు పైగా ఖర్చు చేసి కాలేయ మార్పిడి ఆపరేషన్లు చేయించు కోవాలి. దానం చేసే వారు కూడా అందుబాటులో ఉండాలి. లేదా బ్రెయిన్ డెడ్ అయ్యి అవయవ దానం చేసేవారు ఉండాలి. లేకుంటే ప్రాణాలు పోతాయి. ఈ పరిస్థితిని గుర్తించి ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీని కాలేయ దినోత్సవంగా ప్రకటించింది. శనివారం జిల్లాలో వైద్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాలేయం శరీరంలో అతి పెద్ద గ్రంధి. మెదడు తర్వాత అతి ప్రధానమైన అవయవం. రక్తాన్ని ఫిల్టర్ చేయడంలో సాయపడటం, విటమిన్ డీని శరీరానికి అందేలా చూడటం, చక్కెర స్థాయిని సమతుల్యం చేయడం, ఆహారాన్ని జీర్ణం చేయడం, ఖనిజ లవణాలను, విటమిన్లను నిల్వ చేయడం లాంటి పనులు చేస్తోంది. ఆరోగ్య సమస్యలు ఎక్కువ కాలం కొనసాగితే హెపటైటీస్, సిర్రోసిస్, కామెర్లు, కేన్సర్ లాంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల లివర్‌ను మంచి ఆహారపు అలవాట్లతో కాపాడుకోవాలి.
60 మందికి పైగా లివర్ మార్పిడి
జిల్లాలో లివర్ డ్యామేజైన వారు ఇప్పటికే 60 మందికి పైగా దాతల సాయంతో మార్పిడి చేయించుకుని జీవిస్తున్నారు. కాలేయం కొంచెం దానం చేస్తే సరిపోతుంది. మళ్లీ పూర్తి స్థాయిలో ఏర్పడుతుంది. అందువల్ల లివర్ మార్పిడిపై అపోహాలు వీడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇటీవల కూడా పలువురు రక్త సంబంధీకుల ద్వారా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారు. నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తికి ఆయన తమ్ముడు లివర్‌ను దానం చేశాడు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఏసీనగర్‌కు చెందిన ఓ మహిళకు ఆమె కుమార్తె, పొదలకూరు దగ్గర నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి ఆయన భార్య లివర్‌ను దానం చేశారు. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు.
జిల్లాలో సుమారు 30 లక్షల జనాభా ఉండగా అందులో వివిధ రకాల కాలేయ సమస్యలతో బాధపడేవారు సుమారు 3 లక్షల మంది ఉన్నట్లు అంచనా. అతిగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం, కుర్చీలకు పరిమితమై పనులు చేస్తున్న వారికి ఊబకాయం వస్తోంది. ఇలా ఉన్న వారిలో ఫ్యాటీ లివర్ సమస్యలున్నాయి. ఇది ఉన్నట్టు చాలామందికి తెలియదు. తక్కువ మందిలో జన్యుపరమైన అంశాలు కూడా ఫ్యాటీ లివర్‌కు కారణమవుతున్నాయి. స్కానింగ్ చేయించుకుంటేనే తెలుస్తుంది.
పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, పప్పులు, పాలు తీసుకుంటే మంచిది. మితంగా భుజించాలి. శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. షుగర్, బీపీ ఉన్న వారు అప్పుడప్పుడూ లివర్ పరీక్షలు చేయించుకుని డాక్టర్ సలహాలు పాటించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది ఆహారమే ఔషధం అనే థీమ్‌ను ప్రకటించింది.

ఆహారం విషయంలో జాగ్రత్త

ఆహారం విషయంలో జాగ్రత్త