
ఆన్‌లైన్‌లో పాలిసెట్ హాల్‌టికెట్లు
నెల్లూరు (టౌన్): పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్లను polycetap. nic. in వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 30వ తేదీలోపు ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. పోస్టు ద్వారా ఎవరికి రావన్నారు.
470 పొగాకు
బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో శుక్రవారం 470 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి జీ రాజశేఖర్ తెలిపారు. వేలానికి 643 బేళ్లు రాగా 470 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో 60487.9 కిలోల పొగాకును విక్రయించగా రూ.15435796.70 వ్యాపారం జరిగింది. కిలో గరిష్ట ధర రూ.280 కాగా కనిష్ట ధర రూ.215 లభించింది. సగటున రూ.255.19 ధర నమోదైంది. వేలంలో 10 కంపెనీల వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆర్‌ఐఓగా వరప్రసాద్‌రావు బాధ్యతల స్వీకరణ
నెల్లూరు (టౌన్): ఇంటర్మీయట్ బోర్డు జిల్లా రీజనల్ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్ (ఆర్‌ఐఓ) (ఎఫ్‌ఏసీ)గా టి. వరప్రసాద్‌రావును నియమిస్తూ ఇంటర్మీ డియట్ విద్యా మండలి కార్యదర్శి కృతిక శుక్లా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం స్టోన్‌హౌస్‌పేటలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వరప్రసాదరావు ప్రస్తుతం వెంకటాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలోనూ ఆయన 2021 నుంచి 2022 వరకు ఆర్‌ఐఓగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కళాశాలలు నిర్వహించే విధంగా కృషి చేస్తానన్నారు. వచ్చే నెలలో జరగనున్న ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ సందర్భంగా వరప్రసాదరావును పలువురు కాంట్రాక్ట్ అధ్యాపక అసోసియేషన్ నాయకులు, కార్యాలయ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
28న కందుకూరులో జాబ్‌మేళా
నెల్లూరు (పొగతోట): ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయీమెంట్ ఆఫీస్, సీడాప్ సంయుక్తంగా ఈ నెల 28న కందుకూరులోని ఎంఆర్‌ఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్ ఖయ్యూం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మేళా జరుగుతుందన్నారు. ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారన్నారు. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ చదివిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9848050543, 7286822789 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
పింఛన్ దరఖాస్తులు
పూర్తిస్థాయిలో పరిశీలించండి
నెల్లూరు (పొగతోట): వితంతువులకు పింఛన్ మంజూరు కోసం ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని, వచ్చిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించి అప్‌లోడ్ చేయాలని డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి ఎంపీడీఓలను ఆదేశించారు. శుక్రవారం డీఆర్‌డీఏ కార్యాలయం నుంచి ఎంపీడీఓలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో పీడీ మాట్లాడారు. పింఛన్ వస్తూ భర్త మరణిస్తే ఆ పింఛన్‌ను భార్యకు వితంతు పింఛన్‌గా మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. అటువంటి పింఛన్ల దరఖాస్తులు మాత్రమే స్వీకరించాలన్నారు. పింఛన్ల పంపిణీ శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.

ఆన్‌లైన్‌లో పాలిసెట్ హాల్‌టికెట్లు