
ఊపిరాడక ఇద్దరు చిన్నారుల దుర్మరణం
రంగారెడ్డి జిల్లా దామరగిద్దలో ఘటన
రంగారెడ్డి జిల్లా: మేనమామ పెళ్లి వేడుకలకోసం అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ మృత్యువాతపడ్డారు. కారు డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దామరగిద్దలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దామరగిద్దకు చెందిన తెలుగు జంగయ్య, అనసూయల కుమారుడు రాంబాబు వివాహం ఈనెల 30న జరగనుంది. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా రాంబాబు అక్కాచెల్లెళ్లైన సీతారాంపూర్‌కు చెందిన ఉమారాణి, పామెన గ్రామానికి చెందిన జ్యోతి తమ పిల్లలను తీసుకుని రెండు రోజుల క్రితం దామరగిద్దకు వచ్చారు.
ఇంటికి రంగులు వేసే పనులు కొనసాగుతుండటంతో పిల్లలంతా కలసి బయట ఆడుకుంటున్నారు. వీరిలో ఉమారాణి చిన్న కూతురు అభినయశ్రీ (4), జ్యోతి చిన్న కూతురు తన్మయశ్రీ(5) ఇంటి ఎదుట పార్క్ చేసి ఉన్న కారులోకి ఎక్కారు. కొద్దిసేపటి తర్వాత పిల్లలు డోర్లు వేసుకోవడంతో అవి లాక్ అయ్యాయి. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. పిల్లలందరూ ఒకే చోట ఆడుకుంటున్నారని భావించిన కుటుంబ సభ్యులు వారివారి పనుల్లో మునిగిపోయారు.
సుమారు రెండు గంటలు గడిచిన తర్వాత అభినయశ్రీ, తన్మయశ్రీ కనిపించకపోవడంతో అంతా వారికోసం వెతుకుతుండగా కారు డోర్లు తీసి చూశారు. ఇద్దరు చిన్నారులు ఊపిరి ఆడక అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిశీలించిన వైద్యులు పిల్లలు మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల మృతి ఘటన దామరగిద్దతోపాటు సీతారాంపూర్, పామెన గ్రామాల్లో విషాదం నింపింది. పిల్లల తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు అందరినీ కలచి వేశాయి.