
ఇంకా లభించని ఆ ఆరుగురి ఆచూకీ
విజయవాడ వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు
హైదరాబాద్: బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గల్లంతైన ఆరుగురు కుటుంబ సభ్యులు విజయవాడ వెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వారి ఆచూకీ కనిపెట్టేందుకు బోయిన్‌పల్లి పోలీసులు ప్రత్యేక బృందాన్ని విజయవాడ పంపించారు. ఆరుగురిలో ఒక్కరి వద్దే సెల్‌ఫోన్ ఉండగా అది కూడా స్విచ్చాఫ్ కావడంతో వారి ఆచూకీ కనుక్కోవడం కొంత కష్టంగా మారినట్లు తెలుస్తోంది.
బోయిన్‌పల్లికి చెందిన మహేశ్ తన భార్య ఉమ, ముగ్గురు పిల్లలు రిషి, చైతు, శివన్, మరదలు సంధ్యతో కలిసి ఈ నెల 1న ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయారు. రెండు రోజుల అనంతరం మహేశ్ బావమరిది బిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ మొదలు పెట్టారు. మహేశ్ కుటుంబం 1వ తేదీన బోయిన్‌పల్లి నుంచి నేరుగా, ఇమ్లీబన్‌కు చేరుకుని అక్కడ విజయవాడకు వెళ్లే గరుడ బస్సు ఎక్కినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. మరుసటి రోజు ఉదయం విజయవాడలో దిగినట్లు కూడా సీసీ కెమెరాల్లో రికార్డయింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని బాలంరాయి పంప్‌హౌజ్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న మహేశ్, తోటి ఉద్యోగులతో ముభావంగానే ఉండేవాడని తెలుస్తోంది. మహేశ్ కుమారుడు ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో తీర్థయాత్రలకు వెళ్లి ఉండచ్చొని మహేశ్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వీరి గల్లంతుకు గల ఇతరత్రా కారణాలు ఏవైనా ఉంటాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇతర కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. గల్లంతయిన వారి ఆచూకీ తెలిశాకే పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.