
సాక్షి,హైదరాబాద్: భూదాన్ భూముల భాగోతంపై ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ఈడీ అధికారుల విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా ఐఏఎస్ అమోయ్ కుమార్ శుక్రవారం ఉదయం ఈడీ కార్యాలయానికి వచ్చారు.
అనంతరం, ఆయనను ఈడీ అధికారులు బయటకు తీసుకెళ్లారు. తిరిగి ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అయితే ఈడీ కార్యాలయం నుంచి ఐఏఎస్ అధికారిని బయటకు తీసుకెళ్లిన ఈడీ అధికారులు సర్వే నెంబర్ 181,182 మహేశ్వరం మండలం నాగారంలోని భూములపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. సుమారు 70ఎకరాల భూదాన్ భూముల అన్యాక్రాంతంపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం.
భూముల అక్రమ బదిలీ ఆరోపణలు
మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల బదిలీపై ఈడీ విచారణ చేపట్టింది. ఇక్కడ రూ.వందల కోట్ల విలువైన 42 ఎకరాలను ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ అక్రమంగా బదిలీ చేశారని ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌గా అమోయ్ కుమార్ పనిచేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన పాత్రపై నిజానిజాలను తేల్చేందుకు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఇవాళ మూడో రోజు ఐఏఎస్ అమోయ్ కుమార్ ఈడీ ఎదుట హాజరయ్యారు.