
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఈడీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం సృష్టించాయి. సురానా ఇండస్ట్రీస్‌తో పాటు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. సురానాకి అనుబంధంగా సాయి సూర్య డెవలపర్స్ పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో ఈడీ.. అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, జూబ్లీహిల్స్‌లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
వివరాల ప్రకారం.. సురానా గ్రూప్ చైర్మన్, ఎండీ నివాసాలు, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ చైర్మన్, ఎండీల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని నాలుగు ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. చెన్నై చెందిన ఈడీ బృందాలు సోదాల్లో పాల్గొంది. సూరానా గ్రూప్స్.. చెన్నైలోని ప్రముఖ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టిన నేపథ్యంలో ఇప్పటికే సురానా గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదైంది. ఇక, తాజాగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయంలో ఈడీ సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. ఈడీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
