
రాష్ట్ర పాలనా యంత్రాంగంలో భారీ బదిలీలు
18 మంది ఐఏఎస్, ఇద్దరు నాన్ కేడర్ అధికారులకు స్థానచలనం
రెండుగా పురపాలక శాఖ విభజన..
హెచ్‌ఎండీఏ లోపలి, వెలుపలి ప్రాంతాలకు వేర్వేరు కార్యదర్శులు
సీఎంఓలోని ఇండస్ట్రీ, ఇన్వెస్ట్‌మెంట్ సెల్, స్పీడ్‌కు జయేశ్ రంజన్
సర్కారు ప్రాధాన్యతలకు అనుగుణంగా కొత్త పోస్టింగ్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పాలనా యంత్రాంగంలో భారీగా బదిలీలు జరిగాయి. ఆదివారం తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణారావును నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ వెంటనే పలు కీలక శాఖలు, విభాగాలకు కొత్త బాస్‌లను నియమించింది. పెట్టుబడుల ఆవిష్కరణ, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, హైదరాబాద్ నగరాభివృద్ధి, పట్టణాభివృద్ధి వంటి ప్రభుత్వ ప్రాధాన్యాంశాలకు అనుగుణంగా కొత్త జట్టును సిద్ధం చేసింది. ఈ మేరకు 18 మంది ఐఏఎస్‌లు, ఇద్దరు నాన్ కేడర్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
కీలకమైన ఐటీ, పరిశ్రమలు, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేశ్ రంజన్‌ను సీఎంఓలోని ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సెల్, స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫీషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (స్పీడ్) విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/సీఈఓగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో పరిశ్రమలు, ఐటీ, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, కర్మాగారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్ స్థానచలనం పొందారు. ఇక గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేవిధంగా ‘ఎక్స్’లో పోస్టులను షేర్ చేసిన యువజన అభ్యుదయ, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి, పురావస్తు శాఖ డైరెక్టర్ స్మితా సబర్వాల్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.
ఆమెను రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యకార్యదర్శిగా మళ్లీ ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసింది. ఆమె స్థానంలో యువజన అభ్యుదయ, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి, పురావస్తు శాఖ డైరెక్టర్‌గా జయేశ్ రంజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆ శాఖ ఆధ్వర్యంలోనే హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండగా, శాఖాధిపతిని మార్చడం గమనార్హం. సీనియారిటీ ప్రకారం సీఎస్ రేసులో ముందంజలో ఉన్న శశాంక్ గోయల్‌ను ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ డీజీ పోస్టు నుంచి మరో ప్రాధాన్యత లేని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్ పోస్టుకు ప్రభుత్వం బదిలీ చేసింది.
రెండుగా పురపాలక శాఖ విభజన
పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్‌ను ప్రభుత్వం కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, కర్మాగారాల శాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ శాఖను రెండుగా విడగొట్టి ఇద్దరు కార్యదర్శులను నియమించింది. పురపాలక శాఖ డైరెక్టర్, కమిషనర్ టీకే శ్రీదేవిని పురపాలక శాఖ (హెచ్‌ఎండీ వెలుపలి ప్రాంతం) కార్యదర్శిగా బదిలీ చేసింది. హెచ్‌ఎండీఏ వెలుపలి ప్రాంతాల్లోని పురపాలికలు మాత్రమే ఈ పోస్టు పరిధిలోకి రానున్నాయి.
మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ (హెచ్‌ఎండీఏ పరిధి) పేరుతో కొత్త శాఖను సృష్టించి దాని కార్యదర్శిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ కె.ఇలంబర్తిని బదిలీ చేసింది. ఇక ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో ఒకటైన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ ఆథారిటీ(ఎఫ్‌సీడీఏ) కమిషనర్‌గా కె.శశాంకను నియమించింది. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) సీఎండీగా అదనపు బాధ్యతల నుంచి సందీప్‌కుమార్ సుల్తానియాను తప్పించింది.
జెన్‌కో సీఎండీగా సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఎక్స్‌అఫిషియో స్పెషల్ సెక్రటరీ ఎస్.హరీశ్‌ను నియమించింది. సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఎక్స్‌అఫిషియో స్పెషల్ సెక్రటరీగా, రెవెన్యూ శాఖ సంయుక్త కార్యదర్శిగా హరీశ్ అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు.


