
బహిరంగ మార్కెట్‌లో ఆస్తుల విలువపై ఏసీబీ అంచనా
ఇప్పటికే పలు భూములు, విల్లాలు, కార్లు, బంగారం గుర్తించిన ఏసీబీ
బినామీలపై ఆరా తీస్తున్న అధికారులు
చంచల్‌గూడ జైలుకు హరిరామ్ తరలింపు
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గజ్వేల్ ఈఎన్సీ భూక్యా హరిరామ్ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు చేసిన ఏసీబీ బృందాలు పలుచోట్ల భూములు, ఇతర ఆస్తులు ఉన్నట్టు గుర్తించాయి. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.250 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ గృహాలు, షేక్‌పేటలో ఒక విల్లా, కొండాపూర్‌లో ఒక విల్లా, మాదాపూర్‌లో ఒక ఫ్లాట్, నార్సింగిలో ఒక ఫ్లాట్, అమరావతిలో ఒక వాణిజ్య స్థలం, మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్‌చెరులో 20 గుంటల భూమి, బొమ్మలరామారంలో 6 ఎకరాల్లో మామిడి తోటతో కూడిన ఫామ్ హౌస్, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం, కుత్బుల్లాపూర్‌లో, మిర్యాలగూడలో స్థలాలు ఉన్నట్టు కీలక ఆధారాలను అధికారులు సేకరించారు.
బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల విలువ కట్టేపనిలో ఉన్నారు. అదేవిధంగా మూడు బ్యాంకు లాకర్లను అధికారులు గుర్తించారు. ఈ లాకర్లను తెరిచేందుకు అనుమతి కోరుతూ అధికారులు సోమవారం కోర్టులో మెమో దాఖలు చేయనున్నట్టు సమాచారం. కాగా, శనివారం అర్ధరాత్రి వరకు సోదాలు జరిపిన అధికారులు.. హరిరామ్‌ను అరెస్టు చేసి జడ్జి ముందు హాజరుపర్చగా. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
బినామీలపై ఆరా: ఈఎన్సీ హరిరామ్ అక్రమార్జనను కొందరు బినామీల పేరిట పెట్టినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. వారు ఎవరు, ఎక్కడెక్కడ వారి పేరి ట ఆస్తులు ఉన్నాయనే కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. జలసౌధ కార్యాల యంలో సేకరించిన పలు పత్రాలు, హరిరామ్ ఇంట్లో లభించిన పత్రాలను పరిశీలించే పనిని ప్రత్యేక టీంకు అప్పగించినట్టు తెలిసింది. హరిరాం ఇంట్లో, సిద్దిపేట జిల్లా మర్కూక్ తహ సీల్దార్ ఆఫీసులో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఆయన భార్య అనితపై కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.