
వెంగళరావునగర్(హైదరాబాద్): మహిళలు స్నానం చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీస్తున్న వ్యక్తిని మధురానగర్ అసోసియేషన్ నేతలు పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం... మధురానగర్‌కాలనీ కమ్యూనిటీహాల్‌లో కొన్నేళ్లుగా ఓ కుటుంబం విధులు నిర్వర్తిస్తోంది. వారి కుమార్తె సమీపంలోని చీరల దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా పని చేస్తోంది.
ఆమె సోమవారం ఉదయం విధులకు వెళ్లడానికి స్నానం చేస్తూ సబ్బు కోసం వెతికింది. అయితే ఆమెకు అక్కడ మొబైల్ ఫోన్ చేతిని తాకింది. భయపడి దుస్తులు ధరించి బయటకు వచ్చి చూడగా కమ్యూనిటీహాల్‌లో ఎలక్ట్రిషియన్‌గా విధులు నిర్వర్తించే వై.మరియాలి కుమార్ స్నానం గది కిటికీ పక్కన దాక్కుని ఉన్నాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజేయగా అతడు వచ్చి మరియాలి కుమార్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఫోన్‌తో సహా అతను పారిపోయాడు. విషయాన్ని బాధితురాలు సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రతాప్‌రెడ్డి తదితరులకు తెలియజేసింది.
సంఘం నేతలు పోలీసులకు ఫోన్ చేసి ఎలక్ట్రిషియన్‌ను పట్టుకుని విషయాన్ని సేకరించారు. ఐదేళ్లుగా మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు, ఫొటోలు తీస్తున్నట్లుగా అంగీకరించాడు. తాను తీసిన వీడియోలు, ఫొటోలు అన్నీ తొలగించినట్టుగా తెలియజేశాడు. అనంతరం నిందితుడిని కాలనీ నేతలు మధురానగర్ పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.