
సాక్షి, హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ ప్రదర్శన చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, మంత్రులు, ఎమ్మెల్యే లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. భారత్ సమ్మిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులు సైతం ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
అందరం ఒక్కటై ఉగ్రవాదంపై పోరాడాలి: సీఎం రేవంత్‌రెడ్డి
అందరం ఒక్కటై ఉగ్రవాదంపై పోరాడాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. దాడులకు పాల్పడినవారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతీ చర్యకు మద్దతు పలికేందుకు అందరం సిద్ధంగా ఉన్నాం. అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
‘‘ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సానుభూతి తెలుపుతోంది. ఆ కుటుంబాలకు అందరం అండగా నిలబడి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినపుడు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారు. ఒక్క దెబ్బతో పాకిస్తాన్‌ను పాక్, బంగ్లాదేశ్ అని రెండు ముక్కలు చేశారు. ఆ సందర్భంలో ఇందిరాగాంధీని వాజ్ పేయ్ దుర్గామాతతో పోల్చారు. ప్రధాని మోదీ.. మీరు దుర్గామాత భక్తులుగా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోండి. ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలి’’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.