
సీసీ కెమెరాల ఏర్పాటుకు కసరత్తు
మహిళలకు అవగాహన కార్యక్రమాలు
బోగీల్లో సీసీ కెమెరాల బిగింపునకు కసరత్తు
ఎంఎంటీఎస్‌ల్లో నిరంతర నిఘా
సికింద్రాబాద్– మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలులో అత్యాచార యత్నం ఘటన రైల్వే పోలీసుల డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. ఘటన జరిగి 15 రోజులు గడిచినా ఈ కేసు మిస్టరీ వీడనేలేదు. అధునాతన సాంకేతికతను సొంతం చేసుకున్నామంటూ గొప్పలు చెప్పే నగర పోలీసులు.. అత్యాచార యత్నం కేసు గుట్టు విప్పలేకపోయారు. కాగా.. ఈ ఘటన రైల్వే పోలీసులకు కనువిప్పు కలిగించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలకు సంబంధించి కసరత్తు చేస్తున్నారు. ఇటు జీఆర్‌పీ, అటు ఆర్‌పీఎఫ్ పోలీసు బాస్‌లు మహిళలే ఉండడంతో ఎంఎంటీఎస్ రైళ్లు, రైల్వేస్టేషన్లలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నారు.
తనపై లైంగిక దాడికి యత్నించడంతో ఓ యువతి బోగీ నుంచి కిందకు దూకిన ఘటనతో ఎంఎంటీఎస్ రైళ్లలో నిరంతర పోలీసు భద్రత అందుబాటులోకి వచి్చంది. ఉదయం 5 మొదలు అర్ధరాత్రి 12 గంటల వరకు రైల్వే పోలీసులు ఎంఎంటీఎస్ రైళ్లలో పహారా కాసేలా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలోని అన్ని మార్గాల్లో రాకపోకలు సాగించే ఎంఎంటీఎస్ రైళ్లలో ఒక్కో రైలుకు ఇద్దరు ఆర్‌పీఎఫ్ సిబ్బంది విధుల్లో ఉంటున్నారు. ఇందుకోసం వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసిన ఆర్‌పీఎఫ్ ఆఫీసర్లు ఏ రూటు ఎంఎంటీఎస్‌లో ఎవరు డ్యూటీలో ఉన్నారు? ఆ రైలులో మహిళల బోగీల పరిస్థితి ఏంటన్న విషయాన్ని వీడియో కాల్స్, ఫోటోల పోస్టింగ్‌ల ద్వారా ఆరా తీస్తున్నారు.
రైలు బోగీల్లో సీసీ కెమెరాలు..
నగరంలో నడుస్తున్న నాలుగైదు ఎంఎంటీఎస్ రైళ్లలో మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. సత్వరమే అన్ని ఎంఎంటీఎస్‌లలోని మహిళల బోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎంఎంటీఎస్ స్టేషన్లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అంశాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు పరిశీలిస్తున్నారు. మహిళలు వారికి కేటాయించిన బోగీల్లో మాత్రమే ఎక్కాలని అవగాహన కలిగిస్తున్నారు.
స్టేషన్లలో భద్రత పెంపు..
30 స్టేషన్ల నుంచి సుమారు 92 వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో 40 నుంచి 60 వేల మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నట్టు అంచనా. అత్యాచార ఘటనకు ముందు కేవలం 9 ఎంఎంటీఎస్ స్టేషన్లలో మాత్రమే ఒక్కో స్టేషన్‌లో ఒక్కో కానిస్టేబుల్ చొప్పున విధుల్లో ఉండేవారు. ఘటన అనంతరం ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉండే 15 రైల్వేస్టేషన్లలో ఆర్‌పీఎఫ్ పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. ఆర్‌పీఎఫ్ పోలీసుల్లో కూడా సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో జీఆర్‌పీ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమేణా అన్ని స్టేషన్లలో పోలీసు పహారా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అత్యాచార యత్నం ఘటన నేపథ్యంలో రైల్వే పోలీసులు తీసుకుంటున్న రక్షణ చర్యల పట్ల మహిళా ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైలు బోగీల్లోనే కాకుండా ఎంఎంటీఎస్ స్టేషన్లలోనూ భద్రత పెంచాలని చెబుతున్నారు. ఇది నిరంతర కొనసాగించాలని కోరుతున్నారు.
ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం
రైల్వే ప్రయాణికులకు రక్షణ కలి్పంచడం కోసం ప్రత్యేక మొబైల్ బృందాలను ఏర్పాటు చేశామని జీఆర్‌పీ సికింద్రాబాద్ ఎస్‌పీ చందనా దీప్తి తెలిపారు. మహిళలు ప్రమాదకర పరిస్థితులు ఎదురైన సందర్భాల్లో 139 నెంబర్‌కు కాల్ చేయాలని కోరారు ఒక్కో రైలుకు ఇద్దరేసి గార్డులను ఎస్కార్టు డ్యూటీలో నియమించామని ఆర్‌పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యురిటీ ఆఫీసర్ దేబాస్మిత ఛటోపాధ్యాయ బెనర్జీ తెలిపారు.