
సాక్షి, హైదరాబాద్: ‘గత ప్రభుత్వ హయాంలో కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలను అస్తవ్యస్తంగా ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు ఇ బ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో చర్చించి వాటిని సరిచేసేందుకు సానుకూల నిర్ణయం తీసుకుంటాం’అని రె వెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల స మయంలో పెద్దసంఖ్యలో సభ్యులు, రెవెన్యూ డి విజన్లు, మండలాల గందరగోళంపై అడిగిన ప్ర శ్నలకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి కోరారు.
ఐదు మండలాలున్న చేర్యాల ప్రాంతంలో ప్రజలకు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, పోలీసు సంబంధిత పనులకు హుస్నాబాద్‌కు, వ్యవసాయశాఖ పనులకు గజ్వేల్ కార్యాలయానికి, కలెక్టరేట్ కోసం సిద్దిపేటకు తిరగాల్సి వస్తోందని, దీన్ని సరిదిద్దాల్సిన అవసరముందన్నారు. ముధోల్, తాండూరు, జడ్చర్ల, వేములవాడ, నారాయణఖేడ్, వర్ధన్నపేట, మహబూబాబాద్.. ఇలా పలు నియోజకవర్గాల పరిధిలో నెలకొన్న ఇలాంటి సమస్యలపై సభ్యులు లేవనెత్తారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశం కలెక్టర్ పరిశీలనలో ఉందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇలాంటి సమస్యలపై సీఎం, సహచర మంత్రులతో చర్చించి వాటిని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.