
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా అవయవదానానికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకొచ్చారు. అవయవదానం బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సభలో తాను అవయవ దానానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. మనం లక్షలాది మంది ప్రజలకు ప్రతినిధులం. మనం అందరికీ ఆదర్శంగా నిలవాలి’’ అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. మన నియోజకవర్గాల్లో కూడా అవయవదానం అంశంలో చైతన్యం తీసుకురావాలన్న కేటీఆర్.. ప్రజలందరికీ దీనిపై అవగాహన కల్పించాలని కోరారు.
ఈ మేరకు ఆలోచన ఉన్న సభ్యులు ముందుకు వస్తే శాసన సభ ప్రాంగణంలోనే సంతకాల సేకరణ చేపడదామని స్పీకర్‌కు కేటీఆర్ సూచించారు. అందరి కంటే ముందు తానే సంతకం చేస్తానని సభలో కేటీఆర్ ప్రకటించారు. అవయవ దానం అనేది గొప్ప మానవీయ చర్య. ఇది మరింత మందికి జీవితాన్ని ప్రసాదిస్తుందని కేటీఆర్ అన్నారు.
ఎంతో ఉపయోగకరం.. అభినందనలు: హరీష్‌రావు
అవయవదానం బిలుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అవయవదానంపై పెట్టిన బిల్లు ఎంతో ఉపయోగకరమని.. అభినందనలు తెలుపుతున్నామన్నారు. నాకున్న సమాచారం మేరకు ఈరోజు వరకు 3724 మంది అవయవదానం కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు. ఈ రోజు పెట్టిన బిల్లు వీరందరికీ ఎంతో ఊరట చెందే విషయం. ఈ బిల్లు ద్వారా గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్‌కు అవయవదానం చేసే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా స్వాప్ ద్వారా పరస్పరం అవయవ దానం చేసుకునే అవకాశం కలుగుతుంది. అవయవాల మార్పిడి దందా చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవచ్చు’’ అని ఆయన చెప్పారు.
..ఇప్పటివరకు బ్రెయిన్ డెడ్ అయిన విషయాన్ని న్యూరో ఫిజీషియన్లు మాత్రమే నిర్థారించే వారు. ఈ బిల్లు ద్వారా డాక్టర్లందరూ నిర్ధారణ చేసే అవకాశం కల్పించారు. దీంతో త్వరగా నిర్థారణ చేసి, అవయవ దానం చేసే అవకాశం కలుగుతుంది. జీవన్ దాన్ ప్రోగ్రాం విజయవంతంగా జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 189 అవయవ మార్పిడులు మాత్రమే జరిగితే. బీఆర్ఎస్ పాలనలో 2014లో 233, 2015లో 364, 2016లో 563, 2017లో 573, 2018లో 469, 2019లో 257, 2020లో 616, 2021లో 716, 2022లో 729, 2023లో 725 అవయవ మార్పిడులను జరిపాం. దేశంలో అత్యధిక అవయవదానాలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణను నిలిపాం.
తెలంగాణ రాష్ట్రం అనేక అవార్డులు కూడా పొందింది. ఒకపుడు అవయవదానానికి అమెరికా, లండన్ వెళ్లాల్సి వచ్చేది. బీఆర్ఎస్ హయాంలో నిమ్స్, ఉస్మానియా, గాంధీ లాంటి ప్రభుత్వాసుపత్రుల్లో 609 అవయవమార్పిడి చికిత్సలు జరిగాయి. అవయవమార్పిడి ఖరీదైన చికిత్స, పేదోళ్లు చేసుకోలేరు అనుకుంటారు, కానీ, కేసీఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ కింద 577 అవయవమార్పిడిలు చేశాం. 20 లక్షల ఖర్చయ్యేవి నయాపైసా ఖర్చు లేకుండా ప్రభుత్వాసుపత్రుల్లో చేశాం. సంవత్సరం పాటు మందులు కూడా ఇచ్చాం. కుటుంబీకులు త్వరగా నిర్ణయం తీసుకుంటే ఎక్కువ మందికి మేలు జరుగుతుంది’’ అని హరీష్‌రావు వివరించారు.