
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొన్ని గంటల పాటు మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే నగరంలోని పలు చోట్ల వర్షం పడుతోంది. ఎస్‌ఆర్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, ఖైరతాబాద్, లక్డీకపూల్, సోమాజిగూడ, ఎర్రమంజిల్, తార్నాక, నల్లకుంట, విద్యానగర్, ఎల్‌బీ నగర్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది.
ఒక్కసారిగా వాతావరణం మారి.. వర్షం కురుస్తుండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్ల మీదకు రావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షం కురుస్తోన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాగం అప్రమత్తమైంది.

తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ని జారీ చేసింది. దక్షిణ మధ్యప్రదేశ్ మధ్య నుంచి ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశాల మీదుగా దక్షిణ గ్యాంజెటెక్ పశ్చిమ బెంగాల్ వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. సగటున సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది.