
స్క్రాప్ వేలం ద్వారా రూ.501 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: నిరుపయోగంగా మారిన పాత వస్తువులు రైల్వేకు కాసులు కురిపిస్తున్నాయి. తాజాగా దక్షిణ మధ్య రైల్వే (south central railway) పరిధిలోని డివిజన్‌లలో ఏడాది కాలం నాటి తుక్కును వేలం ప్రక్రియ ద్వారా అమ్మగా, రైల్వేకు ఏకంగా 501.72 కోట్ల రికార్డు ఆదాయం సమకూరింది. అంతకుముందు సంవత్సరంలో ఈ రూపంలో రూ.411.39 కోట్లు సమకూరింది. ఇది ఇప్పటివరకు గరిష్ట మొత్తంగా రికార్డులో నిలిచింది. దీంతో ఈ సంవత్సరం రూ.430 కోట్ల వరకు వేలంలో ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని, అన్ని డివిజన్లలో తుక్కును వేలం వేసింది. అయితే లక్ష్యంగా నిర్ధారించుకున్న మొత్తం కంటే రూ.71 కోట్లు అదనంగా సమకూరటం విశేషం.
గతంలో ఇనుప వస్తువులను ప్రత్యేకంగా వేలం వేసేవారు. ఇప్పుడు ఇనుముతోపాటు పాత కాగితాలు, ఇతర వస్తువులను కూడా కలిపి వేలం వేస్తున్నారు. వేలం (Auction) ప్రక్రియను కూడా ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తుండటం విశేషం. గతంలో వినియోగించి వాడకం ఆపేసిన రైల్ ఇంజిన్లు, ప్రయాణికుల పాత కోచ్‌లు, సరుకు రవాణా వ్యాగన్లు, పట్టాలు, స్లీపర్లు, జాయింట్లు తదితర వస్తువులను వేలంలో ఉంచడం విశేషం. తుక్కు (Scrap) తొలగింపుపై ఆయా విభాగాల అధికారుల, సిబ్బంది కృషిని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ అభినందించారు.
మొరాయించిన మెట్రో రైలు
హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్లు మరోసారి స్తంభించాయి. ఎల్బీనగర్ –మియాపూర్ మధ్య బుధవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో నాంపల్లి వద్ద 15 నిమిషాల పాటు మెట్రో రైలు (Metro Train) ఆగిపోయింది. ఈ క్రమంలో ఆ కారిడార్‌లో నడిచే మెట్రోల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
చదవండి: యువ ఐఏఎస్ అధికారికి ఫ్యూచర్ సిటీ పగ్గాలు!
ఒకవైపు వేసవి దృష్ట్యా అన్ని రూట్లలో రైళ్లు కిక్కిరిసి రాకపోకలు సాగిస్తుండగా అకస్మాత్తుగా తలెత్తిన సాంకేతిక సమస్యలు ప్రయాణికులకు చుక్కలు చూపాయి. మెట్రో సాంకేతిక నిపుణులు తగిన చర్యలు చేపట్టిన తరువాత రైళ్లు యథావిధిగా నడిచాయి. ప్రయాణికులకు అసౌకర్యం కలగడం పట్ల అధికారులు విచారం వ్యక్తం చేశారు.