పదేళ్లూ పెరుగుదలే! | Social sector expenditure increased by Rs 1 lakh crore | Sakshi
Sakshi News home page

పదేళ్లూ పెరుగుదలే!

Published Wed, Dec 11 2024 4:47 AM | Last Updated on Wed, Dec 11 2024 4:47 AM

Social sector expenditure increased by Rs 1 lakh crore

లక్ష కోట్లు పెరిగిన సామాజిక రంగాల ఖర్చు  

రూ.72,658 కోట్ల నుంచి రూ.3,89,673 కోట్లకు పెరిగిన నికర అప్పులు 

10 రాష్ట్రాలు మన కంటే ఎక్కువగా అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్న వైనం 

రిజర్వు బ్యాంకు నివేదిక వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌  : రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రంలో కీలకాంశంగా పరిగణించే ద్రవ్యలోటు గత పదేళ్లలో భారీగా పెరిగిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వె ల్లడించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014–15లో రూ.9,410 కోట్లుగా ఉన్న ద్రవ్యలోటు 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.56,063 కోట్లకు చేరిందని పేర్కొంది. 

పలు సూచీల ఆధారంగా రాష్ట్రాల్లోని ఆర్థిక, విద్య, వైద్య, సామాజిక పరిస్థితులను విశ్లేషిస్తూ దేశంలోని రాష్ట్రాల సంబంధిత గణాంకాలతో (హ్యాండ్‌ బుక్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ఆన్‌ ఇండియన్‌ స్టేట్స్‌–2024) ఆర్‌బీఐ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. 

ఈ రిపోర్టులో వెల్లడించిన ప్రకారం.. దక్షిణాది రాష్ట్రాల్లో ద్రవ్యలోటు భారీగా నమోదవుతోంది. బడ్జెట్‌ పరిమాణం, రాష్ట్రాల స్థూల ఉత్పత్తితో పాటు ద్రవ్యలోటు కూడా అదే స్థాయిలో పెరుగుతోందని తెలిపింది. గత పదేళ్ల కాలంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలకాంశాలు ఇలా ఉన్నాయి. 
 
రూ.9,410 కోట్ల నుంచి రూ.56,063 కోట్లకు పెరిగిన ద్రవ్యలోటు
» తెలంగాణ రాష్ట్ర నికర అప్పులు (గ్యారంటీలు కాకుండా) 2024 మార్చి నాటికి రూ.3,89,673 కోట్లుగా ఉన్నాయి. అదే 2015 మార్చి నాటికి ఇవి రూ.72,658 కోట్లు మాత్రమే. 

»  గత పదేళ్లలో సామాజిక రంగాలపై ఖర్చు భారీగా పెరిగింది. సంక్షేమం, విద్య, వైద్యం, తాగునీటి సదుపాయాల కల్పన, పారిశుధ్యం తదితర అవసరాల కోసం చేసే ఖర్చు 2014–15లో రూ.24,434 కోట్లు ఉండగా, 2023–24లో రూ.1,27,123 కోట్లకు పెరిగింది. ఇక మూలధన వ్యయం 2014–15లో రూ.11,583 కోట్లుగా, 2023–24లో రూ.78,611 కోట్లుగా నమోదైంది.  

»   అప్పులకు వడ్డీల కింద 2014–15లో రూ.5,227 కోట్లు మాత్రమే చెల్లించగా, 2023–24లో రూ.22,408 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. దేశంలోని మరో 10 రాష్ట్రాలు కూడా అప్పులకు వడ్డీల కింద మనకంటే ఎక్కువే చెల్లిస్తుండడం గమనార్హం.  

»  గత పదేళ్ల కాలంలో పన్నేతర ఆదాయంలో పెరుగుదల ఆశించినంతగా కనిపించలేదు. 2014–15లో రూ.6,447 కోట్లు ఉన్న పన్నేతర ఆదాయం స్వల్ప పెరుగుదలతో 2023–24లో రూ.22,808 కోట్లకు చేరింది.  

»  రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే పన్ను ఆదాయం (సొంత రాబడులు) పదేళ్ల కాలంలో బాగానే పెరిగింది. ఇది 2014–15లో రూ.29,288 కోట్లు మాత్రమే ఉండగా, 2023–24 నాటికి రూ.1,31,029 కోట్లకు పెరిగింది. రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాదిలో రూ.10 వేల కోట్లు పెరిగిన సొంత ఆదాయం, వరుసగా మరో రెండేళ్లు అదే స్థాయిలో వృద్ధిని నమోదు చేసింది. కరోనా సమయంలో మాత్రం స్వల్ప హెచ్చుతగ్గులు నమోదు చేసింది. 

2018–19లో రూ.65,040 కోట్లు ఉన్న పన్ను ఆదాయం, 2019–20లో 67,597 కోట్లకు పెరగగా, 2020–21లో రూ.66,650 కోట్లకు తగ్గింది. మహమ్మారి నుంచి బయటపడిన తర్వాతి ఏడాది 2021–22లో ఏకంగా రూ.25 వేల కోట్లు పెరిగింది. ఆ తర్వాతి ఏడాది రూ.10 వేల కోట్లు, గత ఏడాదిలో రూ.21 వేల కోట్లు పెరిగి రూ.1.31 లక్షల కోట్లకు చేరింది.

పరిమిత స్థాయిలో ఓకే.. కానీ..
రెవెన్యూ వసూళ్లు, రుణ వసూళ్లతో పాటు రుణసమీకరణ ద్వారా వచ్చిన రాబడి కంటే ఆ ఏడాదిలో జరిగిన మొత్తం వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని ద్రవ్యలోటుగా పరిగణిస్తారు. వ్యక్తులైనా, వ్యవస్థలైనా, రాష్ట్రాలైనా, దేశాలైనా పొదుపు చేసి పెట్టుబడి పెట్ట డం సాధ్యం కాదు. ఆలస్యం కూడా అవు తుంది. ఈ నేపథ్యంలో పరిమిత స్థాయిలో ఉండే ద్రవ్య లోటును ప్రతికూల కోణంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. 

కానీ స్థాయికి మించి.. అంటే కొత్తగా తెచ్చే అప్పులు, చెల్లించాల్సిన అప్పులు, వడ్డీల కంటే మించితే అది భారంగా పరిణమిస్తుంది. ఆర్‌బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారం 2023–24లో ద్రవ్యలోటు రూ.56 వేల కోట్లకు పెరిగింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం ద్రవ్యలోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3 శాతానికి మించకూడదు. 

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉంది. రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.13.5 లక్షల కోట్లు ఉంటుందనే అంచనా మేరకు, రాష్ట్ర ద్రవ్యలోటు కూడా 4 శాతం మించుతోంది.  – డాక్టర్‌ అందె సత్యం, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement