
డిజిటల్ క్రాప్ సర్వేకు ముందుకొచ్చిన కొందరు
ఉద్యమం కొనసాగిస్తామంటున్న మరికొందరు
పరిస్థితి ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన వ్యవసాయ శాఖ
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ క్రాప్ సర్వేను బహిష్కరిస్తున్న వ్యవసాయ విస్తరణాధికారుల్లో చీలిక ఏర్పడింది.ప్రభుత్వం 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేయడంతో అనేకమంది వెనక్కి తగ్గినట్టు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపితో బుధవారం జరిగిన చర్చల్లో కొందరు ఏఈవోలు సానుకూలత వ్యక్తం చేశారు. వారి సమస్యలపై వచ్చే సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చలు జరిపేందుకు అవకాశం కల్పిస్తానని డైరెక్టర్ హామీ ఇవ్వడంతో ఏఈవోలు తమ సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటున్నామని, డిజిటల్ క్రాప్ సర్వే చేసేందుకు సిద్ధమేనని ఆయనకు తెలిపారు.
వచ్చే వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని, ఏఈవోల సస్పెన్షన్‌ను కూడా ఎత్తివేస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు ఏఈఓలు డిజిటల్ సర్వేలో పాల్గొంటారంటూ డైరెక్టర్ గోపీ ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో కొందరు ఏఈవో సంఘం నేతలు గురువారం నుంచి డిజిటల్ క్రాప్ సర్వే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని సర్వే చేస్తామని తెలిపారు. మొత్తంగా సగం మంది ఏఈఓలు సర్వే చేస్తామని చెబుతుండగా, సగంమంది సర్వే చేసేది లేదని తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా ఏఈఓలు ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వే చేయమని చెబుతున్నట్టు తెలిసింది.
దీంతో ఏఈవోలు రెండు వర్గాలుగా చీలిపోయినట్టు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. కాగా, బుధవారం జిల్లాల నుంచి వందల సంఖ్యలో వచ్చిన ఏఈవోలు వ్యవసాయ కమిషనరేట్ వద్ద నిరసనకు దిగారు. సర్వేలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని, సస్పెండ్ చేసిన ఏఈవోలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక దశలో కమిషనరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు ముందస్తుగా పోలీసులను మోహరించారు.
ఏఈవోల సస్పెన్షన్‌తో వ్యవసాయ కార్యక్రమాలపై ప్రభావం
కక్ష సాధింపు చర్య వల్లే సస్పెండ్ చేశారని ఏఈవోలు మండిపడుతున్నారు. డిజిటల్ క్రాప్ సర్వే విషయంలో ఇంతమందిని సస్పెండ్ చేయడం వల్ల అనేక పథకాలు, వ్యవసాయశాఖ చేపట్టే కార్యక్రమాలకు విఘాతం కలగనుంది. ఇప్పుడు గ్రామాల్లో ధాన్యం, పత్తి మార్కెట్లోకి వస్తుంది. ఈ సమయంలో ఏఈవోలు కీలకంగా వ్యవహరిస్తారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు తలెత్తితే, రైతులకు అందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సింది కూడా ఏఈవోలే. ఇలాంటి కీలక సమయంలో ఏఈవోలపై ఉక్కుపాదం మోపడం పట్ల వ్యవసాయ ఉద్యోగులు మండిపడుతున్నారు.
కాగా, ఏఈవోలు దారికొస్తే సరేసరి లేకుంటే మరికొందరిపైనా కఠిన చర్యలు చేపడతామని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ఏఈవోలకు ప్రత్యేక భారం ఏమీ ఉండదని, వారం పది రోజులపాటు నిర్వహించే డిజిటల్ క్రాప్ సర్వేను బహిష్కరించాల్సిన అవసరం ఏంటని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. కావాలని ఏఈవోలు ఇదంతా చేస్తున్నారని, వారిని ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొడుతున్నాయని అంటున్నారు.
మరోవైపు సమ్మెకు సిద్ధమైన ఏఈవోలకు కొన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటిస్తుండగా, మరోవైపు పేరొందిన పలు ఉద్యోగ సంఘాల నేతలు బెదిరింపులకు దిగినట్టుగా తెలిసింది. ఏ విధంగానైనా సరే ఏఈవోలను సమ్మెకు వెళ్లకుండా వారు తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది.