
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు ఈ నెల 25వ తేదీ లేదంటే 27న విడుదల కానున్నాయి. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇంటర్ బోర్డ్ అధికారులు తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు 1,532 కేంద్రాల్లో జరిగాయి. ఈ పరీక్షలకు 9,96,971 మంది దరఖాస్తు చేశారు. సమాధాన పత్రాల మూల్యాంకనం 19 కేంద్రాల్లో గత నెల 18 నుంచి చేపట్టారు. మొత్తం 60 లక్షల పేపర్లు మూల్యాంకనం చేసి ఆన్‌లైన్‌లో మార్కులు ఫీడ్ చేశారు. వీటిని రెండు సార్లు పరిశీలించిన తర్వాత తుది ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ప్రక్రియ ఈ నెల 20తో పూర్తవుతుందని అధికారులు తెలిపారు.