బీటెక్‌ జోరు.. ఎంటెక్‌ బేజారు! | There has been huge drop in MTech admissions across country | Sakshi
Sakshi News home page

బీటెక్‌ జోరు.. ఎంటెక్‌ బేజారు!

Published Wed, Jan 22 2025 5:58 AM | Last Updated on Wed, Jan 22 2025 5:58 AM

There has been huge drop in MTech admissions across country

గ్రాడ్యుయేషన్‌ తర్వాత మాస్టర్స్‌ వైపు మొగ్గు చూపని విద్యార్థులు

రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఇదే తీరు 

ఎంటెక్‌ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదనే భావన 

నైపుణ్యంతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కే ఐటీ కంపెనీల ప్రాధాన్యం 

ఏడేళ్లలో దేశవ్యాప్తంగా 25 వేల వరకు తగ్గిన ఎంటెక్‌ ప్రవేశాలు  

సత్వర ఉపాధి, ఎమ్మెస్‌ లక్ష్యం.. గణనీయంగా పెరుగుతున్న బీటెక్‌ అడ్మిషన్లు

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా బీటెక్‌కు ఆదరణ పెరుగుతుంటే, మరోవైపు ఎంటెక్‌లో మాత్రం ప్రవేశాలు గణనీయంగా తగ్గుతున్నాయి. సత్వర ఉపాధి, వీలైతే అమెరికా లాంటి దేశాల్లో ఎమ్మెస్‌ లక్ష్యంతో బీటెక్‌లో చేరుతున్న విద్యార్థులు.. పై చదువు విషయంలో నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న ధోరణితో పాటు, పలు మాస్టర్‌ డిగ్రీ కాలేజీల్లో అవసరమైన మౌలిక వసతులు, సరైన బోధన సిబ్బంది ఉండక పోవడం కూడా ఇందుకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేయాలన్నా ఎంటెక్‌తో పనిలేకపోవడం కూడా ప్రవేశాలు తగ్గడానికి మరో కారణమని విశ్లేషిస్తున్నారు.

మరోవైపు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కూడా ఎంటెక్‌కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీనివల్ల విద్యార్థుల్లో అదనంగా ఉండే నైపుణ్యం కూడా అంతగా ఏమీ ఉండదని సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సాంకేతిక విద్యలో గ్రాడ్యుయేషన్‌ తర్వాత యువత ఉపాధి వైపు మళ్లిపోతున్నారు. అనేకమంది ఎంఎస్‌ కోసం విదేశాలకు వెళ్తున్నారు. బీటెక్‌ చేసిన వారిలో కనీసం 10 శాతం కూడా ఎంటెక్‌ వైపు వెళ్లడం లేదని ఏఐసీటీఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏదీ కుదరని పక్షంలో ఎంటెక్‌లో చేరే విద్యార్థులు అత్యాధునిక సాంకేతిక కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది.  

తగ్గిన సీట్లు.. ప్రవేశాలు
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఎంటెక్‌ ప్రవేశాలపై ఇటీవల పూర్తిస్థాయి సమాచారం వెల్లడించింది. ఎంటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలు ఏడేళ్ల కనిష్టానికి పతనమైనట్టు పేర్కొంది. ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ఎంటెక్‌ కోర్సుల్లో 68,677 మంది చేరితే, గత మూడు విద్యా సంవత్సరాల్లోనూ ఈ సంఖ్య దాదాపుగా 45 వేలు మాత్రమే కావడం గమనార్హం. ఈ మేరకు అందుబాటులో ఉన్న ఎంటెక్‌ సీట్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2017–18లో దేశవ్యాప్తంగా 1.85 లక్షల సీట్లు ఉంటే, 2024–25 నాటికి 1.24 లక్షలకు తగ్గాయి. ఇక రాష్ట్రంలో 2019–20 విద్యా సంవత్సరంలో 12,892 మంది ఎంటెక్‌లో చేరితే 2023–24 నాటికి ఆ సంఖ్య ఏకంగా 5,271కి దిగజారిపోవడం గమనార్హం.

బీటెక్‌లో భిన్న పరిస్థితి 
బీటెక్‌ విషయంలో దేశవ్యాప్తంగా ఎంటెక్‌కు భిన్నమైన పరిస్థితి కన్పిస్తోంది. 2017–18లో 14.75 లక్షల సీట్లుంటే, 7.50 లక్షల మంది విద్యార్థులు చేరారు. 2023–24లో సీట్ల సంఖ్య 13.49 లక్షలకు తగ్గినా..విద్యార్థుల చేరిక మాత్రం గణనీయంగా పెరిగి 11.21 లక్షలకు చేరింది. దాదాపు 58% విద్యార్థులు కంప్యూటర్‌ సైన్స్, ఆరి్టఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ, డేటాసైన్స్‌ వంటి కోర్సుల్లోనే చేరుతున్నారు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత సత్వర ఉపాధి, విదేశాల్లో ఎమ్మెస్‌ తదితర కారణాలతోనే బీటెక్‌లో ప్రవేశాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఎంటెక్‌తోనూ మంచి భవిష్యత్తు 
వాస్తవానికి ఎంటెక్‌లో కొన్ని బ్రాంచీలకు భవిష్యత్తులో మంచి డిమాండ్‌ ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్, సంబంధిత కొత్త బ్రాంచీల్లో ఉత్తీర్ణులైన వారికి ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బోధించే అర్హత లభిస్తుంది. బీటెక్‌లో ప్రవేశాలు గణనీయంగా పెరుగుతున్న విషయం విదితమే కాగా అందుకు అనుగుణంగా అధ్యాపకుల అవసరం కూడా ఏర్పడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 1.35 లక్షల బీటెక్‌ సీట్లున్నాయి. ఇందులో సీఎస్‌ఈ, ఐటీ, సంబంధిత సీట్లే 68 వేల వరకు ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో కంప్యూటర్‌ సైన్స్‌ సంబంధిత పాఠ్యాంశాలను బోధించే అధ్యాపకులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఎంటెక్‌ సీఎస్‌ఈ, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ, మెషిన్‌ లెర్నింగ్, రోబోటిక్స్‌ లాంటి స్పెషలైజేషన్‌ ఉంటే మంచి వేతనాలు లభించే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏఐసీటీఈ లెక్కల ప్రకారం ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు అవసరం. దీన్నిబట్టి కీలకమైన బ్రాంచీలను పరిగణనలోకి తీసుకున్నా తెలంగాణలోని 68 వేల సీట్లకు గాను 3,400 మంది అధ్యాపకుల అవసరం ఉందని విశ్లేషిస్తున్నారు.

అదనంగా వచ్చేదేమీ ఉండటం లేదు 
సీఎస్‌సీ బీటెక్‌ తర్వాత ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఐటీ రంగంలో చేరిన తర్వాత స్వతహాగా పరిజ్ఞానం ఉంటేనే పురోగతి సాధ్యం. ఒకవేళ రెండేళ్ల పాటు ఎంటెక్‌ చేసి వచ్చినా ప్యాకేజీలో పెద్దగా మార్పు ఉండదు. బీటెక్‌ ఫ్రెషర్స్‌కు ఇచ్చే వేతనమే అప్పుడూ ఉంటుంది. అలాంటప్పుడు ఎంటెక్‌ వల్ల ప్రయోజనం ఏమిటి?  – నీలేశ్‌ పుల్లెల ఐటీ ఉద్యోగి

అర్హత కాదు.. నైపుణ్యమే ముఖ్యం
ఐటీ రంగంలో ఉన్నతమైన అర్హత కన్నా అభ్యర్థి నైపుణ్యానికి పెద్దపీట ఉంటుంది. బీటెక్‌ తర్వాత పలు రౌండ్ల ఇంటర్వ్యూల్లో కంపెనీలు విద్యార్థి నైపుణ్యాన్ని అంచనా వేస్తాయి. నైపుణ్యంతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పరిగణనలోకి తీసుకుని ఉద్యోగాలిస్తాయి. ఈ కారణంగానే ఎక్కువ మంది బీటెక్‌ తర్వాత ఐటీ రంగంలోకి వస్తున్నారు. – రాహుల్‌ సౌరభ్‌ ఐటీ కంపెనీ హెచ్‌ఆర్‌ విభాగం ఉద్యోగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement