
రోడ్డు ప్రమాదంలో మున్సిపల్ కౌన్సిలర్ మృతి
బ్రహ్మంగారిమఠం : మండలంలోని మైదుకూరు – బద్వేలు జాతీయ రహదారిలోని జెడ్.కొత్తపల్లె సమీపంలో శుక్రవారం రాత్రి లారీ, కారు ఢీ కొన్న సంఘటనలో మైదుకూరుకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్ షేక్ ఖాదర్‌బాషా(44) మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బి.మఠం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మైదుకూరు పట్టణం బద్వేలు రోడ్డులో నివాసం ఉంటున్న టీడీపీకి చెందిన మున్సిపల్ 5వ వార్డు కౌన్సిలర్ షేక్ ఖాదర్‌బాషా(44)కు చెందిన టిప్పర్ పీపీ కుంట వద్ద చెడిపోయి ఉండడంతో ఆయన శుక్రవారం రాత్రి తన సహాయకులు మహబూబ్ బాషా, మస్తాన్‌లను తీసుకుని కారులో బయలుదేరాడు. ముందు వెళుతున్న వాహనాన్ని క్రాస్ చేస్తుండగా ఎదుగా వస్తున్న లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఖాదర్ బాషా అక్కడికక్కడే మృతి చెందగా, మహబూబ్‌బాషా, మస్తాన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. మహబూబ్ బాషా పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తరలించారు. మృతుడు ఖాదర్‌బాషాకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో మున్సిపల్ కౌన్సిలర్ మృతి