
బ్రహ్మంసాగర్‌లో కృష్ణా జిల్లా వాసి ఆత్మహత్య
బ్రహ్మంగారిమఠం : కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన వీరబ్రహ్మచారి(45) శనివారం బ్రహ్మంసాగర్‌లో శవమై తేలాడు. పోలీసుల వివరాల మేరకు.. వీరబ్రహ్మచారి రెండు రోజుల క్రితం బ్రహ్మంసాగర్‌లో మునిగి శనివారం శవమై తేలాడు. అతని వద్ద ఉన్న ఆధార్ కార్డును పరిశీలించగా కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
అడవి దుప్పి మృతి
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని కడప–చిత్తూరు జాతీయ రహదారిపై జమాల్‌పల్లె సమీపంలోని షెంఫోర్డ్ స్కూల్ వద్ద శనివారం తెల్లవారుజామున పొడద్దుప్పి మృతి చెందింది. రోడ్డు దాటుతున్నపుడు గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న కడప అటవీ శాఖ రేంజర్ ప్రసాద్ తమ సిబ్బందిని పంపి పోస్టుమార్టం చేయించి ఖననం చేయించారు.
పాఠశాలలు తెరిచే నాటికి పాఠ్య పుస్తకాలు
కడప ఎడ్యుకేషన్ : పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులందరికి పాఠ్యపుస్తకాలను అందజేస్తామని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. కడప పాఠ్యపుస్తకాల గోడౌన్ నుంచి శనివారం పాఠ్య పుస్తకాల వాహనాన్ని గోడౌన్ మేనేజర్ రామాంజనమ్మతో కలిసి డీఈఓ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పుస్తక గోడౌన్ నుంచి ఉమ్మడి జిల్లాకు సెమ్–1కు సంబంధించి 9,76,346 పుస్తకాలు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 7,20, 161 పాఠ్యపుస్తకాలు వచ్చాయన్నారు.

బ్రహ్మంసాగర్‌లో కృష్ణా జిల్లా వాసి ఆత్మహత్య