నో క్యాష్.. ప్రస్తుతం ఏటీఎంలలోనే కాదు.. బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది! పెద్దనోట్ల రద్దు కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తరుణంలో నగదు సమస్య మళ్లీ మొదటికొచ్చింది. రోజువారీ డిపాజిట్లు తగ్గడంతో బ్యాంకుల్లో నగదు నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. దీనికితోడు నెలరోజులుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నుంచి రాష్ట్రానికి నగదు రాకపోవడంతో నోట్ల కష్టాలు తారాస్థాయికి చేరాయి. పక్షం రోజులుగా ఏటీఎం మెషీన్లు మూతపడగా.. బ్యాంకుల్లో ఖాతాదారులకు పరిమితంగా నగదును ఇస్తున్నారు. ఈ నెల 13 నుంచి నగదు విత్‌డ్రాలపై ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ... నగదు నిల్వలు హరించుకుపోవడంతో క్యాష్ కోసం వచ్చే ఖాతాదారులకు బ్యాంకులు మొండిచేయి చూపుతున్నాయి.