
అనిత కుటుంబానికి హీరో విజయ్ పరామర్శ
పెరంబూరు: నీట్ కారణంగా వైద్య కళాశాల్లో సీటు రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అనిత కుటుంబసభ్యులను నటుడు విజయ్ పరామర్శించారు. అనిత మరణాన్ని ఖండిస్తూ నీట్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలో విద్యాలోకం ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అనిత మరణం చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులను స్పందింపజేసింది.
డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ తో పాటు పలువురు అనిత భౌతికకాయానికి అంజలి ఘటించారు. వారంతా నీట్‌ను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రముఖ నటుడు కమలహాసన్ కూడా అనిత విషయంలో తీవ్రంగానే స్పందించారు. మరో విద్యార్థిని నీట్ కారణంగా బలి కాకూడదని, అందుకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని కమలహాసన్ ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.
ఇలాంటి పరిస్థితుల్లో నటుడు విజయ్ సోమవారం ఉదయం అనిత స్వగ్రామం కుళుముర్ వెళ్లి ఆమె తండ్రి షణ్ముగం, సోదరులను పరామర్శించారు. ముందుగా అనిత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన విజయ్ కాసేపు అనిత తండ్రితో మాట్లాడారు. ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సాయం అందించి, ఇతరత్రా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు భరోసా ఇచ్చారు.