సాక్షి, చెన్నై: వైద్య కోర్సులను అభ్యసించేందుకు ‘నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పై తమిళనాడులో రగిలిన వివాదంలో ఉసురు తీసుకున్న విద్యార్థిని కుటుంబానికి రూ. 7 లక్షల పరిహారం అందించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన నీట్ పరీక్షకు వ్యతిరేకంగా సుప్రీం మెట్లెక్కిన అనిత(19) అనూహ్య ఆత్మహత్యపై పలు అనుమానాలకు తావిస్తోంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా అనిత తన చదువును ఆపలేదని ఆమె తండ్రి తెలిపారు.
కేవలం నీట్ పరీక్షే ఆమెను ఆందోళనకు గురి చేసిందని చెప్పారు. తన కూతురు మరణానికి ఎవరు సమాధానం చెప్తారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. నామ్ తమిళర్ కట్చి సంఘం, స్టూడెంట్స్ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రివల్యూషనరీ స్టూడెంట్స్ అండ్ యూత్ ఫ్రంట్ సభ్యులు అనితకు నివాళులు అర్పించారు. నీటి పరీక్షను రద్దు చేయాలంటూ చెన్నైలోని పలు ప్రాంతాల్లో శనివారం ఆందోళన నిర్వహించారు. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష్(నీట్) నుంచి తమళనాడు మినహాయించలేమని కేంద్ర స్పష్టం చేసిన వారం రోజులకు తర్వాత, తనకు ఇక మెడికల్ సీట్ రాదన్న ఆందోళనతో అనిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.