సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘నీట్’ వల్ల తమిళ విద్యార్థులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన చిట్టచివరి ప్రయత్నమూ నీరుగారిపోయింది. తమిళ సిలబస్ విద్యార్థుల కోసం రాష్ట్రం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 85 శాతం రిజర్వేషన్‌కు సుప్రీంకోర్టు నో చెప్పింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్దించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌ను కొట్టివేసింది. తమిళనాడు విద్యార్థులు సైతం నీట్ ప్రవేశప రీక్షను రాయకతప్పని పరిస్థితి నెలకొంది.
ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య విద్యలను అభ్యసించేందుకు ‘నేషనల్ ఎలిజిబిలిటీ, ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను ప్రవేశపెట్టింది. అయితే దీనిపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని ప్రజలు, ప్రతిపక్షాల నుంచి డిమాండ్లు ప్రారంభమయ్యాయి. నీట్ నుంచి మినహాయింపు కోరుతూ వచ్చిన విజ్ఞప్తులు పరిశీలనకు కూడా నోచుకోక పోగా షెడ్యూలు ప్రకారం దేశవ్యాప్తంగా నీట్ నిర్వహించారు. నీట్‌పై మినయింపు లభిస్తుందన్న ఆశతో తమిళనాడు విద్యార్థులు పెద్దగా శ్రద్ద చూపలేదు. ఈ కారణంగా నీట్ ఫలితాల్లో తమిళనాడు విద్యార్థులు దారుణంగా వెనుకబడిపోయారు. దీంతో నీట్ నుండి తమిళనాడును మినహాయింపుపై అసెంబ్లీలో ఒక బిల్లును ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఈ బిల్లు రాష్ట్రపతి కార్యాలయంలో ఇంకా పెండింగ్ దశలో ఉంది.
85 శాతం రిజర్వేషన్: రాష్ట్రపతి ఆమోదానికి ఆలస్యం కావడంతో తమిళనాడు సిలబస్‌లో ఉత్తీర్ణులైన వారికి వైద్యవిద్యలో 85 రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ రిజర్వేషన్‌ను సీబీఎస్‌ఈ సిలబస్ విద్యార్థులు వ్యతిరేకిస్తూ, ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. విద్యార్థులు వాదనతో ఏకీభవించిన మద్రాసు హైకోర్టు 85 రిజర్వేషన్ చట్టాన్ని రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. అయితే మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ప్రభుత్వం అప్పీలు పిటిషన్ దాఖలు చేసింది. అప్పీలు పిటిషన్‌పై ఇరువర్గాల వాదన పూర్తికాగా సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. మద్రాసు హైకోర్టు జారీచేసిన 85 శాతం రిజర్వేషన్ రద్దు ఆదేశాలపై స్టే విధించేందుకు వీలులేదని న్యాయమూర్తులు అన్నారు.
దేశవ్యాప్తంగా విద్యార్థులందరినీ సమభావనతో చూడాలనే ఉద్దేశంతోనే నీట్ విధానాన్ని ప్రవేశపెట్టారని, అయితే తమిళనాడులో స్టేట్, సెంట్రల్ సిలబస్ పేరున విద్యార్థులను విభజించి పక్షపాత ధోరణిని చూపడం సమంజసం కాదని వారు హితవుపలికారు. 85 శాతం రిజర్వేషన్ చట్టాన్ని రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్దిస్తూ రాష్ట్ర ప్రభుత్వ అప్పీలు పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని న్యాయమూర్తులు తీర్పుచెప్పారు. దీంతో తమిళనాడు విద్యార్థులకు నీట్ తప్పదని భావించాల్సి ఉంటుంది. అయితే నీట్ మినహాయింపు కోరుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటం తమిళనాడులో దింపుడుకళ్లెం ఆశలు రేకెత్తిస్తోంది.
ఈఏడాది 'నీట్' తప్పదు
Published Fri, Aug 11 2017 8:11 PM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM
Advertisement
Advertisement