చెక్కును తిరస్కరించిన అనిత కుటుంబం!
సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వం ఇవ్వజూపిన రూ. 7 లక్షల చెక్కును అనిత కుటంబం తిరస్కరించింది. వైద్య కోర్సుల ప్రవేశానికి ఉద్దేశించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పై తమిళనాడులో రగిలిన వివాదంలో అనిత ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె కుటుంబానికి రూ. 7 లక్షల పరిహారం అందించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో అరియలూరు కలెక్టర్ జీ లక్ష్మీప్రియ స్వయంగా అనిత ఇంటికి వెళ్లి.. ఆమె కుటుంబసభ్యులకు చెక్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, చెక్ తీసుకునేందుకు అనిత కుటుంబసభ్యులు నిరాకరించారు.
'నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు కల్పించాలని కోరుతూ అనిత చనిపోయింది. ప్రభుత్వ ఆర్థక సాయం కోసం కాదు' అని అనిత సోదరుడు మణిరత్నం ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన అనిత (19) ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకుంది. దీంతో సులువుగా తనకు వైద్య కళాశాలలో సీటు వస్తుందని భావించింది. అయితే, నీట్ వల్ల ఆమెకు సీటు రాకపోవడంతో నీట్ పరీక్షకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో అనిత అనూహ్య ఆత్మహత్యపై పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.