దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు: నటి
సాక్షి, చెన్నై : వైద్య కోర్సులను అభ్యసించేందుకు ‘నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పై తమిళనాడులో రగిలిన వివాదంలో విద్యార్థిని ఎస్.అనిత(19) ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. అనిత మృతిపై శుక్రవారం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, డీఎంకే నేత ఎంకే స్టాలిన్ సంతాపాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా నటి కీర్తి సురేష్ అనిత ఆత్మహత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువతకు ఆమె ఓ విజ్ఞప్తి చేశారు. ఏదైనా సాధించాలనుకుంటే అందుకు ఆత్మహత్య మాత్రం పరిష్కారం కాదని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.
విద్యార్థిని అనిత తన లక్ష్యాలను నెరవేర్చుకోలేక పోయారని, మహిళా శక్తిని నిరూపించే ఓ శక్తిని మనం కోల్పోయామని ఆమె తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. నీట్ కారణంగా దళిత విద్యార్థిని అనిత కలలు ఆవిరైపోయాయని రజనీకాంత్ చెప్పారు. రాజకీయ బేరసారాలతో తమిళనాడు ప్రభుత్వం నిరుపయోగంగా మారిందని ఎంకే స్టాలిన్ దుయ్యబట్టారు. బాధిత విద్యార్థిని కుటుంబానికి రూ. 7 లక్షల పరిహారం అందించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించారు. అయితే నీట్ వివాదం నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలని ఆందోళన వ్యక్తమవుతోంది.
అనిత.. చదువులో సరస్వతీ.. కానీ!
అనిత రాష్ట్ర ఇంటర్ బోర్డు పరీక్షల్లో 1200 మార్కులకు గాను 1176 మార్కులు సాధించారు. మెడిసిన్ కటాఫ్‌లో 196.75 మార్కులు వచ్చాయి. అయితే నీట్ పరీక్షలో మాత్రం ఆమెకు కేవలం 86 మార్కులే రావడంతో ఎంబీబీఎస్ సీటు రాలేదు. తనకు డాక్టర్ కావాలని ఉందని, ఇంటర్ మార్కులను బేస్‌గా తీసుకుంటే తనకు మెడికల్ సీటు వస్తుందని అయితే నీట్ పరీక్షను ప్రామాణికంగా తీసుకోవద్దంటూ అనిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నీట్ ఆధారంగానే అడ్మిషన్స్ తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆగస్టు 22న తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆందోళనకు గురైన అనిత ఆత్మహత్య చేసుకున్నారు.
#RIPAnitha #Strengthtoherfamily pic.twitter.com/2G8TehrpQj
— Keerthy Suresh (@KeerthyOfficial) 2 September 2017