ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: నీట్‌కు సిద్ధం అవుతున్న విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలల నుంచే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకునే వెసులు బాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇందుకోసం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సెప్టెంబర్‌లో దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష తేదీని కేంద్రం ప్రకటించడంతో రాష్ట్రంలో వైద్య చదువుల ఆశలతో ఉన్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. దేశ వ్యాప్తంగా ఈ దరఖాస్తుల ప్రక్రియ రెండు రోజుల క్రితమే మొదలైనా రాష్ట్రంలో జాప్యం తప్పలేదు.
ఈ ఏడాది నీట్ ఉంటుందా, ఉండదా అన్న డైలమాలో ఉన్న విద్యార్థులు తాజాగా దరఖాస్తు ప్రక్రియపై దృష్టి పెట్టారు. అదే సమయంలో నీట్ దరఖాస్తుల నమోదు ప్రకియ అంతా ఆన్‌లైన్‌లో సాగనుంది. ఈ పరీక్షకు సిద్ధం అవుతున్న ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు దరఖాస్తులను పూర్తి స్థాయిలో ఏ మేరకు ఆన్‌లైన్‌లో నమోదు చేయగలరో, ఏదేని పొరబాట్లు జరిగిన పక్షంలో పరీక్ష రాయలేని పరిస్థితి తప్పదన్న విషయాన్ని విద్యాశాఖ గుర్తించింది.
స్కూళ్లలోనే నమోదు....
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, నగర, పట్టణాల్లోని పేద విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల నమోదు కష్టాలను పరిగణించి ఆయా స్కూళ్లలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో సాగుతున్న పాఠశాలల నుంచి నీట్‌కు సిద్ధం అవుతున్న విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలోనే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తు నమోదు ఆన్‌లైన్‌లో సక్రమంగా జరిపే రీతిలో చర్యలు తీసుకోవడమే కాకుండా, ఈ ప్రక్రియను ఆగస్టు 6వ తేదీలోపు ముగించాలని, ఆయా పాఠశాలలకు విద్యాశాఖ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.
అదనంగా సెంటర్లు..
నీట్ శిక్షణ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆరోగ్యమంత్రి ఎం సుబ్రమణ్యం తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ నీట్ నుంచి మినహాయింపు వస్తుందని ఎదురుచూశామని, అయితే, కేంద్రం పరీక్షల్ని ప్రకటించిందని పేర్కొన్నారు. తాము మాత్రం ఈ పరీక్షల్ని వ్యతిరేకిస్తూనే ఉన్నామన్నారు. ప్రస్తుతం కేంద్రం తేదీ ప్రకటించిన దృష్ట్యా, ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదుకు చర్య చేపట్టక తప్పలేదన్నారు. ఈ సారి పరీక్షలకు రాష్ట్రంలో 18 కేంద్రాలు ఏర్పాటు చేశారని, అలాగే, వారి వారి మాతృభాషల్లో పరీక్షలకు అనుమతి ఇచ్చినట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment