వివాదాస్పద చిత్రంలో నాయకిగా అతిలోకసుందరి శ్రీదేవి వారుసురాలు జాన్వీకపూర్ నటించనుందా? జాన్వీ కోలీవుడ్ ఎంట్రీ గురించి ఇటీవల చాలానే చర్చ జరుగుతోంది. ఆమె తండ్రి, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ హిందీ చిత్రం పింకూను తమిళంలో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. అజిత్ కథానాయకుడిగా నటించబోతున్న ఈ చిత్రంలో ఒక అతిథి పాత్ర ద్వారా జాన్వీ కోలీవుడ్‌కు పరిచయం కానుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో జాన్వీ గురించి మరో సంచలన వార్త ప్రచారంలోకి వచ్చింది. వర్మ చిత్ర వ్యవహారం తెలిసిందే. తెలుగు సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డికి రీమేక్‌గా తమిళంలో బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని విడుదల చేయడం లేదని, మళ్లీ పూర్తిగా రీషూట్ చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాత ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. నటుడు విక్రమ్ వారసుడు ధ్రువ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఇది. అతని తొలి చిత్రమే ఇలా అవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వర్మ చిత్రాన్ని తెరకెక్కించింది సాధారణ దర్శకుడు కాదు. తమిళ సినీ చరిత్రలో గుర్తుండిపోయే చిత్రాలను అందించిన జాతీయ అవార్డులను తమిళ సినిమాకు అందించిన దర్శకుడు బాలా. అలాంటి దర్శకుడిని ఇది అవమానించే చర్చగా భావిస్తూ పలువురు దర్శకులు ఆయనకు మద్దతుగా గొంతు విప్పుతున్నారు. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో తెలియదు. వర్మ చిత్ర నిర్మాత మాత్రం ఆ చిత్రాన్ని రీషూట్ చేయడానికి ప్రయత్నాలు చేసేస్తున్నారు.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి దర్శకుడు గౌతమ్‌మీనన్, 96 చిత్రం ఫేమ్ సీ ప్రేమ్‌కుమార్, మలయాళ సినీ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రన్, బిజాయ్ నంబియార్‌లతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మరి వీరిలో ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. ఇకపోతే వర్మ చిత్రంలో ధృవ్‌నే మళ్లీ నటిస్తాడని నిర్మాతలు పేర్కొన్నారు. అతనికి జంటగా నటించిన బెంగాలీ బ్యూటీ మేఘా చౌదరి పరిస్థితినే అర్థం కావడం లేదు. ఆమె పాత్రలో ఇప్పుడు శ్రీదేవి వారసురాలు జాన్వీని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. మరి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా? జాన్వీ వివాదాస్పదంగా మారిన అర్జున్‌రెడ్డి రీమేక్‌లో నటించడానికి అంగీకరిస్తుందా? అన్నది వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment